ఈవీఎంలలో అవకతవకలపై ఎన్నికల తర్వాత నిరాటంకంగా విమర్శలు చేస్తున్న చంద్రబాబు..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను హ్యాక్ చేస్తారని చెప్పి భారీ చర్చకు తావిచ్చారు. రూ.10 కోట్లిచ్చిన అభ్యర్థిని ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది తేల్చాలన్నారు. ముంబైలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రచారం అనంతరం కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కలిసి చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం, ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలను ఎన్నో విధాలుగా హ్యాక్ చేయవచ్చని.. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈవీఎంలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు.