ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసింది. ముంబై ఇండియన్స్‌కు టీమ్ ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఐపీఎల్ 2020 సీజన్ ముగిసింది. ముంబై ఇండియన్స్‌కు టీమ్ ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రోహిత్‌ను వన్డే, టీ20 మ్యాచుల్లో భారత కెప్టెన్ చెయ్యాలని అభిమానులతో పాటు పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ నాయకత్వంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు గుప్పించాడు. రోహిత్ కెప్టెన్సీని గంగూలీ, ధోనీల కెప్టెన్సీతో పోల్చాడు. గంగూలీ కెప్టెన్సీలో భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్.. ధోనీ సారథ్యంలోనూ సుదీర్ఘకాలం క్రికెట్ ఆడాడు. గంగూలీ భారత టీమ్‌ను ముందుకు నడిపించినప్పుడు ఎలాగైతే బౌలర్లపై విశ్వాసం ఉంచేవాడో.. రోహిత్ కూడా అలాగే తన బౌలర్లపై నమ్మకం ఉంచుతున్నాడని పఠాన్ పేర్కొన్నాడు.
‘ఫైనల్లో జయంత్ యాదవ్‌ను రోహిత్ వినియోగించుకున్న వాడుకున్న తీరు అతడి ఆలోచనా ధోరణికి అద్దం పడుతుంది. వేరే కెప్టెన్ ఎవరైనా సీమర్‌కి బౌలింగ్ ఇచ్చేవాడు. కానీ రోహిత్ గొప్పగా ఆలోచించాడు. అతడి ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం అవుతోంది. అతడు బౌలర్ల కెప్టెన్ అని తేలింది. గంగూలీ, ధోనీ కలిస్తే రోహిత్. దాదా తన బౌలర్లను విశ్వసించేవాడు, వారి సలహాలను తీసుకునేవాడు. ధోనీ సైతం తన బౌలర్లను నమ్మేవాడు కానీ తన మనసు మాట విని తుది నిర్ణయాలు తీసుకునేవాడు’ అని రోహిత్‌ను పఠాన్ ప్రశంసించాడు.
ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల సమయంలో రోహిత్ తన వ్యూహాలను మార్చుకున్న తీరు, వివిధ రకాల సందర్బాలకు అనుగుణంగా తన ముందున్న ఆప్షన్లను తెలివిగా వాడుకున్నాడని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘ఓ మ్యాచ్ ప్రత్యర్థి విజయానికి చేరువగా వస్తున్నప్పుడు 17వ ఓవర్లో బుమ్రా చేతికి బాల్‌ను అందించాడు. మామూలుగానైతే 18వ ఓవర్ బుమ్రా బౌలింగ్ చేస్తాడు. కానీ ఒక ఓవర్ ముందే బుమ్రాతో బౌలింగ్ చేయించడంతో మ్యాచ్ ముంబై వైపు నిలిచింది. పోలార్డ్‌ను ఎలా వినియోగించుకున్నాడో చూడండి. మొదట అతడితో బౌలింగ్ చేయించలేదు. కానీ వికెట్‌పై పేస్ ఎక్కువగా ఉన్నప్పుడు అతడితో బౌలింగ్ చేయించాడు’ అని పఠాన్ పేర్కొన్నాడు.
Also Read :
ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు బాగున్నాయి, చలి కాలంలో అప్రమత్తత అవసరం : కోటి కమాండ్ సెంటర్ డీహెచ్
తెలుగు ప్రజలకు సీఎంల దీపావళి శుభాకాంక్షలు, ప్రజల జీవితాల్లో పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్ష