డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటేనే పలు వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఒక సినిమా చేస్తున్నాడంటే.. దానిపై ఎన్నో వివాదాలు ముడిపడి ఉంటాయి. ఒక్కోసారి అవి పెద్ద చర్చలకు కూడా దారి తీసిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే.. అయినా.. ఆయనలో మరో కోణం దాగి ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
ఇటీవలే హైదరాబాద్ శివారున జరిగిన ‘దిశ’ ఘటనపై ఆర్జీవీ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు. ఇదే విషయంపై ఈ ఘటనలో నిందితుడైన చెన్నకేశవుల భార్యతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె గురించి తెలుసుకున్న ఆర్జీవీ.. చలించిపోయి చెన్నకేశవుల భార్యకు బ్లాంక్ చెక్ ఇచ్చారని.. టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. ఆ చెక్‌పై ఆమెకు నచ్చినంత రాసుకోమని చెప్పినట్టు సమాచారం. అయితే ఆర్జీవీలో ఇలాంటి మానవీయ కోణం కూడా ఉందా? అంటూ అభిమానులు ఆనందపడుతున్నారు.