అమెరికా ఎన్నికల్లో ఓడిపోయి దాదాపు వారం రోజులవుతున్నా తాను ఓడలేదని మొరాయిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ! ఇప్పటికీ ఆయన వైట్ హౌస్ ను వదలలేదు. ఓ వైపు శ్వేతసౌధం లోకి ఎప్పుడు ఎంటరవుదామా అని ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బైడెన్ తహతహలాడుతుంటే మరోవైపు ఈయనేమో దీన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. ‘ మేమే గెలుస్తాం.’అని ట్వీట్ చేసిన ట్రంప్..కోర్టుల్లో తాము వేసిన దావాల తాలూకు ఫలితాలు వచ్ఛేవారం నుంచి రావడం ప్రారంభిస్తాయని, ‘వుయ్ ఆర్ మేకింగ్ బిగ్ ప్రోగ్రెస్’ అనీ, ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనీ బైడెన్ కి షాకులమీద షాకులిస్తున్నారు. ఇది స్టోలెన్ ఎలెక్షన్ (దొంగిలించిన ఎన్నిక’) అని మాటిమాటికీ నొక్కినొక్కి వక్కాణిస్తున్నారు. ఈ మొండి ఘటానికి ఎలా నచ్చజెప్పాలో తెలియక బైడెన్ వర్గం తల్లడిల్లుతోంది. పైగా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ను ఈయనగారు విధుల నుంచి తొలగించి… బైడెన్ ని మరింత అయోమయంలో పడేశారు. మరి.. న్యాయ నిపుణులంతా ఏమయ్యారో, ఇంత పెద్ద దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నిక పర్యవసానం ఏమిటో తెలియడంలేదు.