దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా కొవిడ్ సోకి ఆస్పత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో మమేకమయ్యే ప్రజాప్రతినిధులు కూడా వైరస్ ధాటికి కుదేలవుతున్నారు. అటు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ పంజాబ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి సుందర్ షామ్ అరోరాకు మంగళవారం కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. ఆగస్టు 28న జరిగే విధాన సభ సమావేశానికి ముందు పంజాబ్ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేయడంతో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ మధ్య కాలంలో ఆయనతో సనిహితంగా మెలిగిన అధికారులు, నేతలందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు మంత్రి సుందర్ షామ్. ఎవరి భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి హోం ఐసోలేషన్ లోనే ఉంటూ త్వరగా కోలుకోవచ్చన్నారు.