
రైతుల కష్టాలపై స్పందించని తమ పార్టీ నేతలు, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పంజాబ్ లో బీజేపీ మాజీ ఎంపీ హరీందర్ సింగ్ ఖల్సా రాజీనామా చేశారు. అన్నదాతలు, వారి కుటుంబాలు, వారి సన్నిహితులు ఈ చట్టాల కారణంగా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారని, అయినా తమ పార్టీ గానీ ఇతర నేతలు గానీ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఖల్సా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని తాను అనుకోలేదన్నారు. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఫతేగడ్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఈయన ఆప్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో వఛ్చిన విభేదాల కారణంగా ఆ పార్టీ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాగా ఫిరోజ్ పూర్ లో పలువురు బీజేపీ నేతలు కూడా ఇటీవల పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీ మాజీ చీఫ్ కమల్ శర్మ మాజీ పీఏ సహా ఈ పార్టీ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేశారు. రైతుల ప్రయోజనాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు దుయ్యబట్టారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కమలం పార్టీ నేతలపై రాజీనామా చేయాలంటూ ఒత్తిడులు పెరుగుతున్నాయి. కాగా మాజీ ఎంపీ ఒకరు వైదొలగడం మాత్రం ఇదే మొదటిసారి.