తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన స్వర్ణ కిరీటాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఎనభై రోజులు శ్రమించి, 230 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకోగలిగారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖాందార్‌కు చెందిన ఆకాశ్ ఈ చోరీలో సూత్రధారి అని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కిరీటాన్ని దొంగిలించిన ఆకాశ్ స్నేహితుడితో కలిసి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన స్నేహితుడిని మాత్రం చెన్నైకు పంపాడని వివరించారు. ఆ తరువాత రేణిగుంట నుంచి రైల్లో హైదరాబాద్ వెళ్లినట్టు ఆయన చెప్పారు. అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ లో మళ్ళీ రైలెక్కి నాందేడ్ జిల్లా ఖాందార్ చేరుకున్నాడని వివరించారు. అక్కడ కిరీటాన్ని అమ్మేందుకు ప్రయత్నం చేశాడని, ఎప్పటికప్పుడు సీసీ టివి ఫుటేజీలను పరిశీలిస్తూ పోలీసులు 89 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. ఇందుకు శ్రమించిన పొలిసు సిబ్బందిని అభినందించారు.