కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన పాక్‌ క్రికెట్‌ ఆటగాళ్లు, ఆఖరి అవకాశం ఇచ్చిన న్యూజిలాండ్‌ ప్రభుత్వం

|

Nov 27, 2020 | 1:44 PM

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ ప్లేయర్లలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే విషయమే అయినా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మరో రకంగా బాధపడుతోంది..

కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన పాక్‌ క్రికెట్‌ ఆటగాళ్లు, ఆఖరి అవకాశం ఇచ్చిన న్యూజిలాండ్‌ ప్రభుత్వం
Follow us on

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ ప్లేయర్లలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే విషయమే అయినా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మరో రకంగా బాధపడుతోంది.. రూల్స్‌ అతిక్రమిస్తున్న పాకిస్తాన్‌ ప్లేయర్లను ఎక్కడ దేశం నుంచి పంపిచేస్తారో అని కంగారుపడుతోంది.. ఇప్పటికే పాక్‌ ఆటగాళ్లు మూడు సార్లు నిబంధనలను ఉల్లంఘించారు.. వారికి ఇంకొక్క అవకాశం మాత్రమే ఉంది.. ఆ అవకాశాన్ని కూడా జారవిడుచుకుంటే అంతే సంగతులు.. నిర్మోహమాటంగా వెనక్కి పంచడానికి న్యూజిలాండ్‌ వెనుకాడదు.. ఇదే విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సీఈవో వసీంఖాన్‌ ఆటగాళ్లకు చెప్పారు. చెప్పడం కాదు హెచ్చరించారు కూడా! ఇది మన దేశ ప్రతిష్టతో ముడిపడిన విషయమని, ఇప్పటికే న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఫైనల్ వార్నింగ్‌ ఇచ్చిందని, ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండండని వసీంఖాన్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. కోవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న న్యూజిలాండ్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేమని వసీంఖాన్‌ తెలిపారు. న్యూజిలాండ్‌ పర్యటనకు వచ్చిన పాకిస్తాన్‌ ఆటగాళ్లకు కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తే ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.. ఆ ఆరుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌కు తరలించింది న్యూజిలాండ్‌ క్రికెట్‌. అయితే ఐసోలేషన్‌లో ఉన్న ఆటగాళ్లు కొందరు నిబంధనలు ఉల్లంఘించారట! ఇది న్యూజిలాండ్‌ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. ఎందుకంటే న్యూజిలాండ్‌ ప్రభుత్వం కరోనాను నియంత్రించడంలో విజయవంతమయ్యింది.. ఇప్పుడు కొత్తగా అక్కడ కరోనా వ్యాప్తి చెందడాన్ని ఎంత మాత్రమూ సహించదు. తమ దేశానికి వచ్చిన పర్యాటకులకు నిబంధనల గురించి వివరంగా చెబుతామని, వారు అర్థం చేసుకుంటారనే నమ్మకం తమకుందని ప్రభుత్వం అంటోంది. న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ సిరీస్‌ వచ్చే నెల పది నుంచి మొదలు కానుంది. డిసెంబర్‌ 18న మొదటి టీ-20 మ్యాచ్‌ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 26 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్‌ ప్రారంభమవుతుంది.