తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త అంకం మొదలైంది. సరికొత్తగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం మొట్టమొదటిసారి సంప్రదింపులు జరిపారు. నాలుగురోజుల పాటు హైదరాబాద్ గాంధీభవన్ లో చేపట్టిన సంప్రదింపుల ప్రక్రియ శనివారం మధ్యాహ్నంతో ముగిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. నాలుగు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాల నుంచి విడివిడిగా సమాచారాన్ని సేకరించారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్. ఈ నేపథ్యంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన త్వరలోనే పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.