పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో తెలుగు భాషకు అధికార హోదా కల్పిస్తూ టీఎంసీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు భాషతోపాటు బెంగాల్‌లో నివస్తున్న తెలుగు వారిని భాషాపరమైన మైనారిటీలుగా గుర్తిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతాలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ తెలిపారు.
బ్రతుకు దెరువు కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళ్లి వేలాది మంది తెలుగు ప్రజలు బెంగాల్‌లో స్థిరపడ్డారు. చాలా మంది నాయకులు బెంగాల్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ పలు పార్టీల్లో ముఖ్య పదవుల్లో కొనసాగుతున్నారు. చాలాకాలంగా తెలుగుబాషాను అధికారిక భాషాగా గుర్తించాలన్న డిమాండ్ తెలుగువారు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు మమతా సర్కార్ అధికారిక భాషా జాబితాలో చేర్చడం పట్ల తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే బెంగాల్ రాష్ట్రంలో హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒరియా, రాజ్‌బాంగ్‌షి, కామటపురి, సంతాలి భాషలకు కూడా అధికారిక భాషగా గుర్తింపు ఇచ్చారు. తాజాగా తెలుగును కూడా ఈ జాబితా చేర్చడం విశేషం.
అయితే, త్వరలో ఏడాది బెంగాల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మినీ ఆంధ్రాగా పేరున్న ఖరగ్‌పూర్‌లోని తెలుగు ప్రజలను ఆకర్షించేందుకు మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు రాజకీయవేత్తలు పేర్కొంటున్నారు. ఖరగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న 35 వార్డుల్లో ఆరు చోట్ల తెలుగు వారు గెలుపొంది కౌన్సిలర్లుగా సేవలందిస్తున్నారు.