ODI Super League: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆగిపోయిన క్రికెట్ టోర్నమెంట్లు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. 2023లో భారత్ వేదికగా జరగాల్సిన ప్రపంచకప్‌కు క్వాలిఫికేషన్ సూపర్ లీగ్ టోర్నీ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌తో మొదలైన ఈ సూపర్ లీగ్‌లో 12 ఐసీసీ సభ్యదేశాలతో పాటు నెదర్లాండ్స్ కూడా పోటీ పడనుంది.
ఈ లీగ్‌లో ప్రతీ జట్టు నాలుగేసి మ్యాచ్‌లు స్వదేశం, విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా జరగనున్నాయి. గెలిచిన మ్యాచ్‌కు 10 పాయింట్లు, అలాగే రద్దైనా, టై అయిన మ్యాచ్‌లకు ఐదేసి పాయింట్లు వస్తాయి. కాగా, ప్రపంచకప్‌లో మొత్తం పది దేశాలు పోటీ పడతాయి. ఇక పూర్తిస్థాయి సభ్యత్వం కలిగిన టాప్ ఏడు దేశాలు, ఆతిధ్య హోదా దేశంతో కలిపి మొత్తం ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు స్థానాలకు ఈ క్వాలిఫికేషన్ సూపర్ లీగ్ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ 2022 చివరికి ముగుస్తుంది.