IMD Alert: కుండపోత.. ఉత్తరాదిలో జలప్రళయం.. మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

అసోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. బ్రహ్మపుత్ర, బరాక్‌ లోయలతో అసోంలోని 35 జిల్లాల్లో 30 జిల్లాలు జలమయం అయ్యాయి. 3,518 గ్రామాల్లో 24లక్షల మందిని వరదలు ప్రభావితం చేశాయి. మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 52కు పెరిగింది.

IMD Alert: కుండపోత.. ఉత్తరాదిలో జలప్రళయం.. మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు
Assam Flood Situation
Follow us

|

Updated on: Jul 06, 2024 | 10:16 AM

అసోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. బ్రహ్మపుత్ర, బరాక్‌ లోయలతో అసోంలోని 35 జిల్లాల్లో 30 జిల్లాలు జలమయం అయ్యాయి. 3,518 గ్రామాల్లో 24లక్షల మందిని వరదలు ప్రభావితం చేశాయి. మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 52కు పెరిగింది. గడచిన 24 గంటల్లో వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. కామ్‌రూప్‌ జిల్లాలో మాత్రం కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. కొండ ప్రాంతమైన దిమా హసావో జిల్లాలోని ఆరు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అసోంలోని మోరిగావ్ జిల్లాలో వరద పరిస్థితి భయంకరంగా ఉంది. మోరిగావ్ జిల్లాలోని 194 గ్రామాలు ముంపునకు గురికావడంతో వేలాది మంది ప్రజలు వరదలతో అల్లాడిపోతున్నారు. బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, నదుల కట్టలు డ్యామేజ్‌ అయ్యాయి. భారీ వర్షాలతో ప్రధాన నదులన్నీ సాధారణ స్థాయి కంటే మించి ప్రవహించడంతోనే 30 జిల్లాలు వరద ప్రభావంలో చిక్కుకున్నాయని అసోం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది. దుబ్రీ, దర్రాంగ్‌, కాచర్‌ జిల్లాలు అత్యధికంగా దెబ్బతిన్నాయని తెలిపింది.

612 రిలీఫ్‌ క్యాంపుల్లో లక్షలాది మంది బాధితులు.. ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం

అసోంలో చెరువులు, ఏర్లుగా మారిన వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అసోం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుమారు 612 రిలీఫ్‌ క్యాంపుల్లో లక్షలాది మంది బాధితులు తలదాచుకుంటున్నారు. నిరాశ్రయులకు తాగు నీరు, ఆహారం సరఫరా చేస్తున్నారు అధికారులు. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కొద్దిరోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా.. డిబ్రూఘర్‌లోని ముంపు ప్రాంతాలను పరిశీలించి వరద బాధితులను పరామర్శించారు. తెంగాఖట్‌లో శిబిరాన్ని సందర్శించి సౌకర్యాలతోపాటు.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు సీఎం హిమంత బిశ్వశర్మ. అయితే.. నదుల కట్టలు తెగిపోయిన ప్రాంతాల్లో మాత్రం వరద ప్రభావం కొనసాగుతుందని చెప్పారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్‌ బంద్‌ చేసినట్లు తెలిపారు సీఎం హిమంత బిశ్వశర్మ.

మరోవైపు.. ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మరో వారంరోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉత్తరాఖండ్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కుండపోత వానలు కురుస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలోని అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అల్లకల్లోలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లో రెండు ప్రధాన నదుల గట్టు తెగిపోవడంతో అనేక చోట్ల వరదలకు దారితీసింది. వేల మంది ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలో 1,300 మంది, ఇంఫాల్ వెస్ట్‌లో దాదాపు 700 మందిని ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాగాలాండ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఐదుగురు ప్రాణాలను బలిగొన్నాయి. మొత్తంగా.. ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో ఆయా రాష్ట్రాల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..