నార్త్ కొరియాకు చెందిన హ్యాకర్లు కోవిడ్ 19 ఫార్మా కంపెనీలను టార్గెట్లుగా చేసుకున్న షాకింగ్ ఉదంతం తెలిసింది. అమెరికా, బ్రిటన్, సౌత్ కొరియా సహా ఆరు ఫార్మా కంపెనీలతో బాటు కనీసం తొమ్మిది హెల్త్ ఆర్గనైజేషన్ల కంప్యూటర్ వ్యవస్థల్లోకి చొరబడేందుకు వీరు యత్నించారట. అమెరికాలోని జాన్సన్ అండ్ జాన్సన్, నోవో వాక్స్, బ్రిటన్ లోని ఆస్ట్రాజెనికా, అలాగే దక్షిణ కొరియాలోని మరో మూడు ఫార్మా సంస్థలను కూడా హ్యాకర్లు తమ టార్గెట్లుగా చేసుకున్నారని తెలిసింది. వీరిని ‘కిముస్కీ’ హ్యాకర్లుగా గుర్తించారు. గత సెప్టెంబరులో వీరి యత్నాలు మొదలయ్యాయని, వెబ్ డోమైన్స్ ని ఉపయోగించి ఆన్ లైన్ లాగిన్ పోర్టల్స్ ద్వారా రకరకాల పధ్దతులను ఉపయోగించారని తెలుస్తోంది. సౌత్ కొరియా పత్రికలువీరి నిర్వాకాన్ని హై లైట్ చేశాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ వీరి థ్రెట్గ్ ను ముందే గుర్తించి అలెర్ట్ అయింది. హ్యాకర్ల ప్రయత్నాల గురించి తమకు తెలుసునని, వారి ఆగడాలను ఎదుర్కొనేందుకు తాము ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నామని ఈ సంస్థ పేర్కొంది. కాగా ఆస్ట్రాజెనికా మాత్రం స్పందించలేదు. తమను రిక్రూటర్లుగా చెప్పుకుంటూ వీరు నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ లోకి, వాట్సాప్ లోకి చొరబడ్డారని, ఫేక్ జాబ్ ఆఫర్లతో స్టాఫ్ ని బుట్టలో వేసుకోవడానికి యత్నించారని, తప్పుడు కోడ్ తో వారి సిస్టమ్స్ లోకి ఎంటరయ్యేందుకు చూశారని కూడా వెల్లడైంది. అయితే జెనెక్సిన్ అనే సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఈ హ్యాకింగ్ అటెంప్ట్స్ ని పసిగట్టింది. దీంతో కిముస్కీ గాళ్ళ ఆగడాలకు తెరపడింది.