
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలీసులు శుభవార్త చెప్పారు. రాష్ట్రం లోపల ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించాలంటే పాస్‌లు అవసరం లేదని తెలిపారు. అంతర్ జిల్లాల్లో పాస్‌లు లేకుండా తిరగొచ్చని చెప్పింది ఏపీ పోలీస్ శాఖ. శుక్రవారం నుంచి ఈ అనుమతులు జారీ చేసినట్టు పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏపీ ప్రజలు చాలామంది ట్విట్టర్ వేదికగా తాము పొరుగు జిల్లాలకు వెళ్లాలని అనమతుల కోసం పోలీసులను అభ్యర్థించారు. సదరు ట్వీట్లకు రెస్పాండ్ అయిన పోలీసులు.. పొరుగు జిల్లాలకు వెళ్లాలంటే పాస్‌లు అవసరం లేదని స్పష్టం చేశారు. పాస్‌లు అవసరం లేనప్పటికీ నిబంధనలు మాత్రం పాటించాలని తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని.. కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. అవి కూడా చిన్నాచితక పనులకు కాకుండా..ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటేనే వెళ్లాలని సూచిస్తున్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక రెడ్, ఆరెంజ్ జోన్స్.. కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయంటున్నారు. అంతేకాదు కర్ఫ్యూ అమలవుతోన్న నేపథ్యంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ సమయం తర్వాత ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవు.
ఇక ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలన్నా అనుమతులు తప్పనిసరి. ఎమర్జెన్సీ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవారికి మాత్రమే పోలీసులు పాస్‌లు జారీ చేయనున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్, కుటుంబంలో మరణం, ప్రభుత్వ విధి నిర్వహణ, సామాజిక పనులు.. తదితర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది. ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.