MJ Market Re Inaugurated : హైదరాబాద్ మహానగరానికి మరో అందం తోడైంది. ఇంతకాలం మరుగునపడిన పురాతన కట్టడం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ఐకానిక్ కట్టడాలలో ఒకటైన మోజంజాహి మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 1935లో నిర్మించిన ఎంజే మార్కెట్‌ను మళ్లీ 85 ఏళ్ల తరువాత పునరుద్ధరణ చేశారు.
పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శుక్రవారం సాయంత్రం లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, రాజ్యసభ సభ్యుడు కేకే, ఎంపీ అసదుద్దీన్ పాల్గొన్నారు.
ఎంజే మార్కెట్ పునఃప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 1935లో నిర్మించిన ఎంజే మార్కెట్‌ను రూ.10 కోట్లతో ఇప్పుడు పునరుద్ధరించామన్నారు. పునరుద్ధరించిన ఎంజే మార్కెట్‌ను పరరిక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అప్పట్లో తాము ఇక్కడకి ఫేమస్ ఐస్ క్రీమ్ కోసం వచ్చేవాళ్లమని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. తెలంగాణ చారిత్రక సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.