ఈ ఏడాది చివరి మన్ ​కీ బాత్: మోదీ ప్రసంగంలో ఎన్నో సంగతులు, విశాఖకి చెందిన వెంకటమురళి గురించి ప్రముఖంగా ప్రస్తావన

|

Dec 27, 2020 | 12:57 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మన్​ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మన్​కీ బాత్.. మరికాసేపట్లో...

ఈ ఏడాది చివరి మన్ ​కీ బాత్: మోదీ ప్రసంగంలో ఎన్నో సంగతులు, విశాఖకి చెందిన వెంకటమురళి గురించి ప్రముఖంగా ప్రస్తావన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మన్​ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మన్​కీ బాత్.. మరికాసేపట్లో ప్రసంగించనున్న ప్రధాని.. ముఖ్యంగా 2020 ఏడాది గురించే ప్రస్తావించే అవకాశముంది. ఈ మన్​ కీ బాత్​ గురించి మోదీ వారం క్రితం ట్వీట్​చేశారు. 2021 సంవత్సరంలో ముఖ్యంగా దేని కోసం ఎదురుచూస్తారని అడిగారు. రైతుల ఆందోళనలనూ ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ను ఈ సారి లక్ష్యంగా నిరసనకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగం ఇచ్చే సమయంలో అంతా పళ్లాలపై చప్పుడు చేస్తూ నిరసన తెలపాలని దేశ ప్రజలను కోరారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Dec 2020 12:40 PM (IST)

    తమిళనాడుకు చెందిన 92 ఏళ్ల టి శ్రీనివాసాచార్య స్వామీజీ తన పుస్తకాన్ని కంప్యూటర్‌లో రాస్తున్నారు : మోదీ

    తమిళనాడుకు చెందిన 92 సంవత్సరాల టి శ్రీనివాసాచార్య స్వామీజీ గురించి మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. స్వామీజీ తన బయోగ్రఫీని కంప్యూటర్‌లో రాస్తున్నారు, అది కూడా ఆయనకు ఆయనే స్వయంగా టైప్ చేసుకుంటున్నారు అని మోదీ చెప్పారు. ఆయన్ను స్పూర్తిగా, ఆదర్శంగా నేటి యువత తీసుకోవాలన్నారు. స్వామీజీ పరిశోధనాత్మకత, ఆత్మవిశ్వాసం అతని చిన్న రోజులనుంచే ఉన్నాయని, సంస్కృత, తమిళ పండితుడైన శ్రీనివాసాచార్య 16 ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారని ప్రధాని మోదీ తెలిపారు.

  • 27 Dec 2020 12:33 PM (IST)

    సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దేశాన్ని మనం వదిలించుకోవాలి: మోదీ

    మనం, మన దేశాన్ని చెత్తాచెదారం చేయమని ప్రమాణం చేయాలని మోదీ దేశవాసులకు పిలుపునిచ్చారు. ఇది స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క మొదటి పరిష్కారమార్గమన్నారు. కరోనా కారణంగా అంతగా చర్చించలేని మరో విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నానని చెప్పిన మోదీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దేశాన్ని మనం కచ్చితంగా వదిలించుకోవాలన్నారు. గురుగ్రామ్ నుండి కర్ణాటక వరకు మనదేశ ప్రజలంతా పరిశుభ్రమైన వాతావరణం పట్ల అభిరుచి ఉన్నవారేనని మోదీ ఈ సందర్భంగా కితాబునిచ్చారు.

  • 27 Dec 2020 12:17 PM (IST)

    కాశ్మీర్‌లోని కుంకుమ పువ్వు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బ్రాండ్ కావాలి : మోదీ

    మన కశ్మీర్‌లో లభించే కుంకుమ పువ్వు (Kashmiri saffron) ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బ్రాండ్ కావాలని ప్రధాని మోదీ కోరారు. ‘ఎప్పుడైనా మీరు కుంకుమ పువ్వు కొనాలనుకుంటే, కశ్మీర్ కుంకుమపువ్వును గుర్తు చేసుకోండి. కశ్మీరీ ప్రజల ఆప్యాయ అనురాగాలతో పెంచే ఆ కుంకుమ పువ్వు రుచి ప్రత్యేకంగా ఉంటుంది’ అని మోదీ అన్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ కుంకుమ పువ్వుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ లభించిన సంగతి తెలిసిందే.

  • 27 Dec 2020 12:12 PM (IST)

    గురు గోవింద్ సింగ్, సాహెబ్‌జాదె త్యాగాల గురించి మోడీ ప్రస్తావన

    సిక్కుల మత గురువు గురు గోవింద్ సింగ్, ఆయన కుమారుడు సాహెబ్‌జాదె త్యాగాల గురించి ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాను కొన్నిరోజుల కిందటే దేశ రాజధానిలోని గురుద్వారాను సందర్శించానని గుర్తు చేసుకున్నారు. సిక్కుల త్యాగనిరతి అత్యంత గొప్పదని మోదీ పేర్కొన్నారు.

  • 27 Dec 2020 12:11 PM (IST)

    కొత్త ఏడాదిలో ప్రతీ భారతీయుడు ఒక చార్ట్ రూపొందించాలని మోదీ పిలుపు

    భారతదేశంలో ప్రతి దేశ పౌరుడు కూడా ‘ఆత్మనిర్భర్ భారత్’ సహా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులకు ప్రత్యామ్నాయంగా రూపొందించాల్సిన అంశాలపై ఓ ఛార్ట్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరేంద్ర మోడీ చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఛార్ట్ చేస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ వస్తువల దిగుమతిని నియంత్రించడంతో పాటు దేశీయంగా అలాంటి వాటికి ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు.

  • 27 Dec 2020 12:08 PM (IST)

    విశాఖపట్నానికి చెందిన వెంకట మురళి గురించి ప్రముఖంగా ప్రస్తావించిన నరేంద్ర మోదీ

    విశాఖపట్నానికి చెందిన వెంకట మురళి గురించి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయన రూపొందించిన ఏబీసీ ఛార్ట్ గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ఛార్ట్ (ఏబీసీ)లో అనేక విషయాలను వెంకట మురళి పొందుపరిచినట్లు నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్, లోకల్ ఫర్ వోకల్, స్టార్టప్‌ల రంగం గురించిన అనేక విషయాలను వెంకట్.. తన ఏబీసీ ఛార్ట్‌లో వివరించారని మోడీ తెలిపారు.

  • 27 Dec 2020 12:04 PM (IST)

    దేశప్రజల వైఖరిలో వచ్చిన ఒక పెద్ద పరివర్తనకు ఇది సజీవ ఉదాహరణ : మోదీ

    భారతీయులంతా ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువలపట్లే ఆసక్తి చూపుతున్నారని మోదీ చెప్పారు. ముఖ్యంగా ఇండియాలో తయారయ్యే బొమ్మలకు మంచి డిమాండ్ ఉందన్నారు. దేశ ప్రజల ఆలోచనా విధానంలో ఇది పెద్ద మార్పని ఆయన తెలిపారు. ఇది ప్రజల వైఖరిలో ఒక పెద్ద పరివర్తనకు సజీవ ఉదాహరణ అని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

  • 27 Dec 2020 11:59 AM (IST)

    దేశంలోని చిరుతపులిల సంఖ్య గణనీయంగా పెరిగింది: ప్రధాని మోడీ

    2014 – 2018 మధ్య కాలంలో భారతదేశంలో చిరుతపులి సంఖ్య 60శాతం పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. దేశంలో చిరుతపులిల సంఖ్య 2014 లో 7,900 గా ఉంటే, ఇది 2019 లో 12,852 కు పెరిగిందని మోదీ తెలిపారు

  • 27 Dec 2020 11:53 AM (IST)

    మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించండి : ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోడీ తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ లో ప్రసంగిస్తూ మేడ్ ఇన్ ఇండియా వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 72 వ మన్ కీ బాత్ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో ఎదురైన ఆటుపోట్లను వివరించారు.

  • 27 Dec 2020 11:34 AM (IST)

    ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విపరీతమైన స్పందనలు

    భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమానికి ఈ నెలలో సూచనలు, సలహాలు చాలా విస్త్రృతంగా వచ్చాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రధానే వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ అమూల్యమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ విషయాలను దాదాపుగా మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

Follow us on