ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీ చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఎంపీ సుల్తాన్ అహ్మద్ చనిపోయారని త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ పార్టీకి అడ్డం వచ్చిన ఎందరో అమాయకులను మోదీ చిత్రహింసలకు గురి చేశారని ఆమె మండిపడ్డారు. శనివారం హౌరాలోని పంచ్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.
అహ్మద్ లుబెరీయా లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా టూరిజం మినిస్టర్‌గా విధులు నిర్వహించారని దీదీ తెలిపారు. కాగా అహ్మద్ సెప్టెంబర్ 4 2017న తన నివాసంలో గుండెపోటుతో మరణించిన విషయాన్ని మమతా గుర్తు చేశారు. ఇది ఇలా ఉంటే సుల్తాన్ అహ్మద్ మీద ఎవరో కుట్ర పన్ని నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇరికించారని అన్నారు. ఇక పలుసార్లు సీబీఐ వాళ్ళు అతనిని ప్రశ్నలతో మానసికంగా హింసించారని దీదీ ఆరోపించారు. వయసులో పెద్దవారు కూడా కానీ సుల్తాన్ అహ్మద్ కేవలం బీజేపీ పార్టీ పెట్టిన చిత్రహింసల వల్లే చనిపోయారని ఆమె పేర్కొన్నారు.
దేశానికి పెద్ద ప్రమాదకారిగా బీజేపీ పార్టీ మారిందని అన్నారు. బీజేపీ పార్టీ వల్ల దేశాభివృద్ధికి నష్టం వాటిల్లుతోందని ఆమె ఆరోపించారు. మోదీ చెప్పేవన్నీ అబద్దాలే అని.. ఇప్పటివరకు దేశం కోసం బీజేపీ పార్టీ ఏమి చేయలేదని ఆమె ఎద్దేవా చేశారు.