
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా మే 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. లాక్‌డౌన్-4లో భారీ సడలింపులు ఇస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల ఎక్కడ ఉండాలి అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అని పేర్కొంది. కాగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది. కరోనా హాట్‌స్పాట్లలో నిబంధలనలు కఠినంగా అమలు చెయ్యాలని ఆదేశించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని తెలిపింది. రెస్టారెంట్లు, హోటళ్లు, విద్యా సంస్థలు మే 31 వరకు మూసివేసి ఉంచాలని కోరింది. మెట్రో రైలు సర్వీసులను మే 31 వరకు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది. రాష్ట్రాల పరస్పర అనుమతితో అంతర్రాష్ట బస్సు సర్వీసులకు నడుపుకోవచ్చునని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రేక్షకులు లేకుండా క్రీడా మైదానాలను ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.
లాక్‌డౌన్-4 మార్గదర్శకాలు:
జోన్ల నిర్ణయం రాష్ట్రాలదే..
కరోనా వ్యాప్తిని బట్టి జోన్లు ఏయే జోన్లే ఎక్కడ ఏర్పాటు చేసుకునే అంశాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే నిర్ణయిస్తాయని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కంటెయిన్‌మెంట్ జోన్లలో ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించింది కేంద్ర హోం శాఖ. కంటెయిన్‌మెంట్ జోన్లలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చేందుకు కూడా అనుమతి లేదు. ప్రతి ఇంటిపై నిఘా ఉండాలని.. అనుమానితులకు అవసరమైన కరోనా టెస్టులు నిర్వహించాలని, పౌరులకు సేవలు అందించాలని పేర్కొంది.