భారీ సిక్సర్‌తో బద్ధలైన సొంత కారు అద్దాలు

ఐర్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌లో ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఒబ్రియాన్‌ బ్యాటింగ్‌ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎదుర్కొన్న ప్రతీబంతిని బౌండరీ దాటించాలన్న కసితో ఉంటాడతను..

భారీ సిక్సర్‌తో బద్ధలైన సొంత కారు అద్దాలు

Updated on: Aug 29, 2020 | 4:15 PM

ఐర్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌లో ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఒబ్రియాన్‌ బ్యాటింగ్‌ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎదుర్కొన్న ప్రతీబంతిని బౌండరీ దాటించాలన్న కసితో ఉంటాడతను.. భారీ షాట్లకు పెట్టింది పేరు! మొన్న గురువారం ఇంటర్‌ ప్రొవిన్షియల్‌ టీ 20 కప్‌ టోర్నమెంట్‌ జరిగింది.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. లీన్‌స్టర్‌ లైట్నింగ్‌ టీమ్‌ తరఫున బరిలో దిగిన ఒబ్రియాన్‌ ప్రత్యర్థి జట్టు నార్త్‌ వెస్ట్‌ వారియర్స్‌ బౌలర్లను చితకబాదేశాడు. 37 బంతుల్లోనే ఎనిమిది భారీ సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.. ఆ ఎనిమిది సిక్సర్లలో ఒకటి అతి భారీ సిక్సర్‌.. ఎంతగా అంటే బంతి స్టేడియం అవతల పడేటంత! స్టేడియం ఆవతలికి రయ్యిమంటూ దూసుకెళ్లిన ఆ బంతి నేరుగా వెళ్లి ఒబ్రియాన్‌ కారు అద్దాలనే పగలకొట్టింది.. ఆ భారీ షాట్‌కు మురిసిపోవాలో లేక కారు అద్దం బద్దలయ్యిందని దిగాలు పడాలో అర్థం కాని పరిస్థితి ఒబ్రియాన్‌ది! ధ్వంసమైన కారు ఫొటోను ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో పోస్టు చేసింది. దీనికి కౌంటర్‌ ట్వీట్‌ కూడా ఇచ్చారు ఒబ్రియాన్‌.. ఇంటికెళ్లేటప్పుడు తనకు ఏసీ అవసరం లేదనుకుంటా అంటూ చమత్కరించాడు.. ఇక నుంచి ఆట ఆడుతున్నప్పుడు కారును కాసింత దూరంగా పార్క్‌ చేస్తానన్నాడు కెవిన్‌ ఒబ్రియాన్‌.. ఎంతైనా డాషింగ్ బ్యాట్స్‌మన్‌ కదా! అందుకే కారు సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు ఫ్రీగానే కొత్త అద్దాన్ని ఫిక్స్‌ చేసి ఇచ్చారు.