ఆ ఊరును చూస్తే ఇంద్రధనుస్సు నేలకు దిగినట్టనిపిస్తుంది!

అనుకోకుండానే కొన్ని ఊర్లకు అదృష్టం పట్టేసుకుంటుంది.ఇహ అప్పుడు వాటికి ఎక్కడ్లేని పాపులారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రంగురంగుల గ్రామానికి..

ఆ ఊరును చూస్తే ఇంద్రధనుస్సు నేలకు దిగినట్టనిపిస్తుంది!
Follow us

|

Updated on: Nov 23, 2020 | 4:01 PM

అనుకోకుండానే కొన్ని ఊర్లకు అదృష్టం పట్టేసుకుంటుంది.ఇహ అప్పుడు వాటికి ఎక్కడ్లేని పాపులారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రంగురంగుల గ్రామానికి అంతే! ఈ గ్రామం పేరు కంపుంగ్‌ పెలంగీ. ఉన్నది ఇండోనేషియాల దేశంలో! చూడ్డానికి ఎంతో అందంగా ఉన్న ఈ గ్రామం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు! అసలు ఈ ఇళ్లకు ఇన్నేసి రంగులను అద్దిందెవరో…! రంగుల వర్ణ చిత్రంలా తీర్చిదిద్దినదెవరో తెలుసుకోవాలని ఉంది కదూ! ముందు కాసేపు ఈ గ్రామం ఫోటోలు చూసి ఆ తర్వాత ఆ ముచ్చట్లు చెప్పుకుందాం!

కంపుంగ్‌ పెలంగీ అన్నది చిన్న గ్రామం. తిప్పికొడితే ఓ 200 ఇళ్లుంటాయంతే! ఈ ఊరుకు ఆనుకుని ఓ నది కూడా ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఈ ఊళ్లో ఉన్నవారంతా నిరుపేదలే! ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం. ముగురునీరు. దోమలు. కంపుకొట్టే దుర్గంధం. అలా ఉండేది ఈ గ్రామం పరిస్థితి. ఇప్పుడేమో గ్రామాన్ని ఇంద్రధనుస్సు కప్పేసిందా అన్నంత అందంగా తయారయ్యింది. ఒక ఐడియా ఆ గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ఆ ఐడియా అక్కడి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ స్లామెట్‌ విడొడోది! తనకొచ్చిన ఆలోచనను ప్రభుత్వం ముందుంచారాయన! ఇక్కడి ప్రభుత్వాల్లా కాదుగా! వెంటనే ఓకే చెప్పేసింది. ఆ వెంటనే లోకల్‌ కౌన్సిల్‌ రంగంలోకి దిగింది. కోట్లు వెచ్చించింది. ప్రతి ఇంటికి రంగులు వేసింది. ఇళ్లనే కాదు, రోడ్లను కూడా రంగులతో ముస్తాబు చేసింది. ప్రతి ఇంటికి కనీసం మూడు రంగులైనా ఉండేట్టు చూసుకున్నారు ఆర్టిస్టులు. కనిపించిన ప్రతీచోటా పెయింటింగ్‌లు వేశారు. గోడలపై ఏంజిల్‌ వింగ్స్‌, త్రీడీ షార్క్‌ వంటి బొమ్మలను గీశారు. మొత్తంగా ఆ గ్రామాన్ని వానవిల్లులా తీర్చిదిద్దారు. ఇప్పుడిది రెయిన్‌బో విలేజ్‌గా పేరుతెచ్చుకుంది.. ఆహ్లాదాన్ని పంచే ఓ పర్యాటక కేంద్రంగా మారింది. ఆలోచన స్లామెట్‌దే అయినా ఈ ఊరుకు ఇంత అందాన్ని తేవడానికి ఎంతోమంది కష్టపడ్డారు. ఆ కష్టం ఫలించింది కాబట్టే ఇప్పుడు ఎంతో మంది టూరిస్టులు కెమెరాలు పట్టుకుని మరీ వస్తున్నారు. నిజంగా ఈ ఊరును రంగులతో తీర్చిదిద్దిన వారు ఆర్టిస్టులు కాదు. హార్టిస్టులు.