కంగనా రనౌత్‌పై జావెద్‌ అక్తర్‌ పరువునష్టం దావా

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, వివాదాల పుట్ట కంగనా రనౌత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆమె తలకు చుట్టుకుంటున్నాయి.. చట్టపరమైన చిక్కులు తెచ్చిపెడుతున్నాయి..ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ ఇప్పుడామెపై పరువు నష్టం దావా వేశారు.

కంగనా రనౌత్‌పై జావెద్‌ అక్తర్‌ పరువునష్టం దావా

Updated on: Nov 04, 2020 | 12:19 PM

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, వివాదాల పుట్ట కంగనా రనౌత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆమె తలకు చుట్టుకుంటున్నాయి.. చట్టపరమైన చిక్కులు తెచ్చిపెడుతున్నాయి..ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ ఇప్పుడామెపై పరువు నష్టం దావా వేశారు. వివిధ న్యూస్‌ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకు ఆమె భంగం కలిగించేలా వ్యాఖ్యానించారంటూ ఏకంగా క్రిమినల్‌ పరువు నష్టం కంప్లయింట్‌ చేశారు. ముంబాయిలోని అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట ఐపీసీ సెక్షన్‌ 499, 500 సెక్షన్ల కింద జావెద్‌ అక్తర్‌ ఫిర్యాదు చేశారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కంగనా రనౌత్‌ అనవసరంగా తన పేరు లాగారంటూ, అందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ జావెద్‌ కోరుతున్నారు. హృతిక్‌ రోషన్‌తో కంగనాకు ఉన్న సంబంధం గురించి మాట్లాడవద్దంటూ ఆమెను తాను బెదిరించానన్నది కూడా పచ్చి అబద్ధమని జావెద్‌ అంటున్నారు.. ఆమె చెప్పిన ఈ మాటల వీడియోను లక్షల మంది చూశారని, దాని వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని జావెద్‌ చెబుతున్నారు. జావెద్‌ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 3 తేదీకి వాయిదా వేసింది.