వివాదాస్పద కల్కిభగవాన్ ఆశ్రమంపై దాడులు జరిపిన ఐటీ శాఖ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా భారీగా నగదు, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సిన దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను కూడా అధికారులు గుర్తించారు. భక్తి ముసుగులో కల్కిభగవాన్ సాగించిన వ్యవహారాలపై తాజాగా చర్చ మొదలైంది. అయితే గత కొంత కాలంగా కల్కిభగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ నాయడు, ఆయన భార్య అమ్మా భగవాన్ అలియాస్ పద్మావతి కనిపించడం లేదు. వీరి అదృశ్యంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు రోజులుగా ఐటీ అధికారులు వరదయ్యపాళెం సహా పలు ఆశ్రమాల్లో ఏకకాలంలో దాడులు చేసి పెద్ద ఎత్తున స్వదేశీ, విదేశీ కరెన్సీ , నగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయిదు కోట్లు విలువ చేసే వజ్రాలు, రూ.26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం, రూ.40,.39 కోట్ల నగదుతో పాటు రూ.18 కోట్ల విదేశీ కరెన్సీ, మొత్తం రూ.93 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కల్కిభగవాన్ కుమారుడు కృష్ణ, ఆయన భార్య ప్రీతిలను చెన్నైకి తరలించి విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్న కల్కిభగవాన్, ఆయన సతీమణి పద్మావతిల జాడ కనిపించలేదు. ఇంతకీ వీరు ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే కల్కి భక్తుల్లో విదేశీ భక్తుల కూడా ఉన్నారు. వీరిలో కొంతమంది మహిళలు అదృశ్యం కావడంపై ఆరోపణలున్నాయి. కల్కిభగవాన్‌కు ఏకంగా స్విస్ బ్యాంకులో అకౌంట్ కూడా ఉందిని అందులో వేలకోట్ల రూపాయలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో భూములు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు కూడా ఉన్నట్టుగా సమాచారం. అయితే ఇవన్నీ వీరిపేరున కాకుండా పలువురు బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ బెంగళూరులో రూ.1000 కోట్ల పెట్టుబడితో రియల్‌ఎస్టేట్ కంపెనీ, లాస్‌ఏంజెల్స్‌లో మరో కంపెనీలు నడుపుతున్న నేపథ్యంలో 400 మంది ఐటీ అధికారులు ఏకకాలంలో 40 కల్కి కేంద్రాలపై బుధవారం నుంచి మెరుపుదాడులు జరిపారు.