
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు మొదటి విడతలోనే జరగనుండటంతో.. ఇరు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. అన్ని పార్టీలూ గెలుపు కోసం వ్యూహరచన మొదలు పెట్టాయి. ఇలా ఉంటే ఏపీలో అధికారక టీడీపీ పార్టీ ఎలాగైనా అధికారం మళ్ళీ నిలబెట్టుకోవాలని చూస్తుంటే.. ప్రతిపక్ష వైసీపీతో సహా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా టీడీపీని గద్దె దించాలని చూస్తోంది. ఇక ఏపీలో బీజేపీకి బలం లేనప్పటికీ టీడీపీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లానని చూస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత నాదెండ్ల భాస్కర్ రావును రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు వినికిడి.
బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో నాదెండ్ల భాస్కర్ రావును విలన్ గా చూపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన చంద్రబాబు అండ్ కో మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ చిత్రం విడుదల సమయంలో ఆయన పలు యుట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూస్ ఇచ్చి మరీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు ఎంతటి ద్రోహం చేశాడు అనే దాన్ని వివరించాడు. ఇప్పుడు దాన్నే అదునుగా తీసుకుని ఆయన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారంలోకి దింపాలని బీజేపీ భావిస్తోందట. ఈమేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ నాదెండ్లను ఇంటికెళ్లి కలిశారట. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాల్ని.. కేంద్రంలో మోదీ పని తీరును వివరించి.. నాదెండ్లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఆహ్వానాన్ని పూర్తి అంగీకరించపోయినప్పటికీ అలోచించి నిర్ణయం చెబుతానని నాదెండ్ల చెప్పారట. ఇక బీజేపీ ఆహ్వానాన్ని నాదెండ్ల ఎలా స్పందిస్తారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.