Introspection in three political parties: దుబ్బాక ఉప ఎన్నిక మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో భిన్నమైన ఆత్మావలోక పరిస్థితులను తీసుకొచ్చాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సంచలన విజయంతో విజేతగా నిలిచిన బీజేపీ.. స్వల్ప తేడాతో ఓటమి పాలైన అధికార టీఆర్ఎస్.. అసలు పోటీ ఇవ్వకుండా చేతులెత్తేసిన కాంగ్రెస్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముందున్న పరిస్థితిలో లోతైన ఆత్మావలోకనంతో సమాయత్తం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి..ఆ పరిస్థితులూ గోచరిస్తున్నాయి. దుబ్బాకలో గెలవగానే గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామంటూ పెద్ద ప్రకటన చేసిన తెలంగాణ బీజేపీ నేతలు అందుకు పెద్ద యుద్ధమే చేయాల్సిన అవసరాన్ని పార్టీలో చర్చిస్తున్నారు. మరోవైపు గత గ్రేటర్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా వంద సీట్లను కైవసం చేసుకున్న గులాబీ దళం.. మరో నెలా, నెలపదిహేను రోజుల్లో జరుగుతాయని భావిస్తున్న గ్రేటర్ పోరులో అదే స్థాయి ఫలితాన్ని సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఇక.. 2014 క్రమంగా బలహీనపడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లేని పక్షంలో మిగిలిన ముఖ్యనేతలు తలోదారి చూసుకునే ప్రమాదం వుండడంతో కాంగ్రెస్ నేతలు కాస్త ఎక్కువగానే ఆత్మావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లను గెలుచుకుంటామంటూ సాధించి చూపిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత ఏ ఎన్నిక వచ్చిన వార్ వన్ సైడ్ అన్నట్లుగా విజయ పరంపరను కొనసాగించింది. ఉప ఎన్నికలైనా.. స్థానిక సంస్థల ఎన్నికలైనా.. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికలైనా గులాబీ దళానికి ఎదురే లేకపోయింది. వరుస విజయాలతో ఊపు మీదున్న కారుకు దుబ్బాక ఉప ఎన్నిక చిన్న స్పీడ్ బ్రేకర్‌గా మారింది. స్వల్ప తేడాతో అక్కడ ఓటమి పాలవడం టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడప్పుడే జీర్ణం కాని విషయం. కానీ.. వెనువెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండడంతో దుబ్బాక ఫలితాన్ని వీలైనంత త్వరగా మరచిపోయి.. నగరంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి గులాబీ దళానిది. అన్నట్లుగానే వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారక రామారావు.. నిరంతరం గ్రేటర్ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వర్గాలను నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా రెడీగా వుండాలని నిర్దేశిస్తున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్టీ సీనియర్లు, మంత్రులతో జీహెచ్ఎంసీ సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో నగరంలో ఎంఐఎం పార్టీతో సయోధ్య అత్యంత కీలకం కాబట్టి గురువారం సాయంత్రం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ప్రగతిభవన్‌కు పిలిపించుకుని మంతనాలు సాగించారు.
మరోవైపు సంచలన విజయంతో సత్తా చాటిన బీజేపీ నేతలు.. పెద్ద పెద్ద ప్రకటనలతో ఊపు మీద కనిపిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోను విజయం సాధిస్తామని కమలదళం గట్టిగా చెబుతున్నా.. అదంత సులభం కాదన్న సంగతి బీజేపీ నేతలకు తెలుసు. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లుంటే.. అందులో 50 దాకా పాతబస్తీ పరిధిలోనివే. అలాంటి పరిస్థితిలో పాతబస్తీలో గణనీయమైన విజయాలు సాధించకుండా.. గ్రేటర్ మీద కాషాయ జెండా ఎగరేయడం సాధ్యం కాదన్నది జగమెరిగిన సత్యం. కానీ పాతబస్తీలో బీజేపీ సానుకూల ఫలితాలను రాబట్టడం అంత ఈజీ కాదు. అలాగనీ అసాధ్యమూ కాదు. అందుకే ట్రిపుల్ తలాక్ వంటి కీలకాంశాలను సైతం పాతబస్తీ ప్రచారంలో విరివిగా వాడుకోవడం ద్వారా ముస్లిం మహిళల ఓట్లను రాబట్టాలన్న వ్యూహం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. మిగిలిన నగరంలో మోదీ చరిష్మాకు టీఆర్ఎస్ పార్టీ మీదున్న వ్యతిరేకతను రాజేసుకుంటే గట్టెక్కుతామన్న ధీమా కనిపిస్తోంది వారిలో. అయితే గ్రేటర్ ఎన్నికల ప్రహసనం మొదలు కాకముందే ఓటరు లిస్టుల ఆధారంగా ఈసీ ఎదుట రచ్చకు దిగారు బీజేపీ నేతలు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని కమలనాథులు ఆరోపిస్తున్నారు.
ఇక పరిస్థితి అంత బాగా లేనిది తెలంగాణ కాంగ్రెస్‌దే. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా బలపడాల్సిన కాంగ్రెస్ పార్టీ.. ఆరేళ్ళ తర్వాత చూస్తే డిపాజిట్లు కూడా సాధించలేని దుస్థితికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. 2018 గెలుచుకున్న హుజూర్‌నగర్ వంటి చోట్ల కూడా ఓటమి పాలైన పరిస్థితి. దుబ్బాకలో డిపాజిట్ కూడా రాని దుస్థితి. వెరసి.. గాంధీభవన్‌లో చాలా లోతైన ఆత్మావలోకనం జరగాల్సి వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే.. అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ మేరకు రెడీగా వుందన్నది అనుమానమే. అయితే.. నానాటికి కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పలువురు నేతలు రెడీ అవుతున్న నేపథ్యంలో సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు మరింత దారుణంగా మారే ప్రమాదం వుందని పరిశీలకులు చెబుతున్నారు.
ALSO READ: జీహెచ్ఎంసీలో ‘గంధపు‘ దొంగలు.. ఏకంగా ఇందిరాపార్కులోనే..!
ALSO READ: యుపీ, బెంగాల్‌పై ఓవైసీ నజర్.. యాక్షన్ ప్లాన్ ఇదే!