రెండు రాష్ట్రాల ఇంటర్ బోర్డు కలిసి 24 మందిని బలితీసుకున్నాయి. అడ్డగోలుగా జవాబు పత్రాల్ని దిద్ది అంతే అడ్డగోలుగా ఫలితాలను విడుదల చేసి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. వాల్యుయేషన్ నుంచి రిజల్ట్స్ వరకు అన్నింటా ఫెయిల్ అయినా… అసలు దోషులు కనిపించరు. ఆక్రోశిస్తున్న తల్లిదండ్రుల్ని మాత్రం ఈడ్చుకుని పోయి శాంతి భద్రతల్ని కాపాడుతున్నామని అంటారు.
ఇంటర్ ఫస్టియర్‌లో 99 శాతం మార్కులు వచ్చిన వారికి సెకండ్ ఇయర్‌లో సున్నా మార్కులు వేసేసారు. 80 శాతం మార్కులు వచ్చిన చాలా మంది విద్యార్థులు ఏదో ఒక పరీక్షలో ఫెయిల్ కావడం ఇంటర్ బోర్డు నిర్వాకానికి పరాకాష్ట. ఫలితాల ప్రక్రియ గ్లోబరీనా అనే సంస్థ చేపట్టింది. తీవ్ర స్థాయిలో తప్పులు దొర్లాయి. ఇలా కూడా ఫెయిల్ చేయొచ్చంటూ ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పారు. ఈ గణాంకాలే ఇప్పుడు సామాజిక విశ్లేషకులకు ఆందోళన కల్గిస్తున్నాయి. ఎక్కువ మార్కులు కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒకవైపు నుంచి తల్లిదండ్రుల ఒత్తిడి…మరోవైపు కార్పోరేట్ కాలేజీల విపరీత చర్యలు వెరసి విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు తిడతారని ఒకరు..స్నేహితుల వద్ద తలెత్తుకోలేమని ఇంకొకరు.. సమాజంలో పరువు పోతుంది మరొకరు…ఇలా ఏదో కారణంతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 సీఈవో రవిప్రకాష్ గారి విశ్లేషణ.