టిక్ టాక్ తో బాటు మొత్తం 59 చైనా మొబైల్ యాప్ లను ప్రభుత్వం నిషేధించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు డీలా పడిపోయారు. వారి ఖాతాలపై నీలినీడలు పరచుకున్నాయి. ఒకప్పుడు ఈ యాప్ అంతగా పాపులర్ కానప్పటికీ.. క్రమంగా బాలీవుడ్ నటీనటుల ఫోకస్ దీనిపై పడింది. దీనిపై వారి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. దీపికా పదుకొనె, సారా అలీఖాన్, షాహిద్ కపూర్, మాధురీ దీక్షిత్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ వంటి చాలామంది తమ అభిమానులతో టచ్ లో ఉండేందుకు, తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు దీనిపై ఆధారపడుతూ వచ్చారు. ఇప్పుడు వీరికేం చేయాలో తోచడం లేదు. వీరే కాదు.. పలు ప్రభుత్వ సంస్థలకు కూడా ఈ బ్యాన్ తో కాస్త ‘నష్టమే’ అంటున్నారు. మై గవర్నమెంట్ ఇండియా అకౌంట్ కి సుమారు పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ వేదిక కూడా కనుమరుగై పోయింది. ఇంకా కర్ణాటక ప్రభుత్వం, గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ వంటి అనేక సంస్థలు కోవిద్-19 పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దీన్ని వినియోగించుకుంటూ వచ్చాయి. భారత-చైనా దళాల ఘర్షణపై ప్రధాని సందేశాలను ప్రచారంలోకి తెచ్చెందుకు ప్రెస్ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ యాప్ ని వినియోగించుకునేది. చైనా కంపెనీతో సిగ్నలింగ్ కాంట్రాక్టును రద్దు చేసుకున్న రైల్వే శాఖకూ టిక్ టాక్ లో ఖాతా ఉన్న విషయం గమనార్హం.