మాజీ మంత్రి వివేక్ హత్యకేసులో సీబీఐ దూకుడు..!

|

Nov 12, 2020 | 10:17 AM

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో మళ్లీ దూకుడ పెరిగింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ మూడో దఫా విచారణ ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.

మాజీ మంత్రి వివేక్ హత్యకేసులో  సీబీఐ దూకుడు..!
Follow us on

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో మళ్లీ దూకుడ పెరిగింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ మూడో దఫా విచారణ ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. వివేకా హత్యకేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో సీబీఐ అధికారులు.. వివేకా కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పులివెందుల కోర్టు నుంచి తీసుకునే అవకాశం ఉంది. ముగ్గురు అనుమానితుల నార్కో పరీక్షల నివేదిక, వివేకా రాసినట్లు చెబుతున్న చివరి లేఖ వివరాలను పులివెందుల కోర్టు నుంచి తీసుకునే వీలుందని విశ్వసనీయ సమాచారం.

వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. హత్యకేసును ఛేదించేందుకు హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నెల రోజుల విరామం అనంతరం తిరిగి కడపకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా పులివెందుల, కడప ప్రాంతాల్లో అనుమానితులను విచారించిన అధికారులు కీలక ఆధారాల సేకరించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి జులై 9వ తేదీన సీబీఐ అధికారులు ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేశారు. ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు రిజిష్టార్ అయ్యింది. ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచికి చెందిన 3వ విభాగానికి కేసు బాధ్యతలు చేపట్టింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారి దీపక్‌కౌర్‌ ను నియమించారు. సీబీఐ అధికారుల బృందం ఇప్పటికే రెండు మార్లు పులివెందులలో పర్యటించి పలువురి అనుమానితులను విచారించి వెళ్లింది. ఈ ఏడాది జులై 18వ తేదీన తొలిసారిగా జిల్లాకు వచ్చిన సీబీఐ అధికారులు రెండు వారాల పాటు అనుమానితులను కడప, పులివెందులలో విచారించి వెళ్లారు. అనంతరం రెండో దఫా విచారణ సెప్టెంబరు 12వ తేదీ నుంచి చేపట్టారు. దాదాపు నెలరోజుల పాటు విచారణ చేసిన తరువాత కొందరు అధికారులు కరోనా బారిన పడడంతో వెళ్లిపోయారు.

పిటిషన్‌ వేసిన సీబీఐ.. ఆ సమయంలోనే పులివెందుల కోర్టులో వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలు కావాలని కోరుతూ సీబీఐ పిటిషన్‌ వేసింది. పులివెందుల కోర్టు వివరాలు ఇవ్వడానికి నిరాకరించడంతో.సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 2వ తేదీన సీబీఐ అధికారులు హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. పులివెందుల కోర్టులో ఉన్న వివేకా కేసు వివరాలను దర్యాప్తు చేయడానికి అనువుగా ఇవ్వాలని కోరుతూ సీబీఐ పిటిషన్‌ వేసింది. దానిపై బుధవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అడిగిన వివరాలను వెంటనే ఇవ్వాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో మరోసారి సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చి వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలను కోర్టు ద్వారా తీసుకుని విచారణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఈ కేసులో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సింహాద్రిపురం మండలానికి చెందిన శేఖర్‌రెడ్డి, వాచ్‌మెన్‌ రంగయ్యలకు గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లో నార్కో పరీక్షలు నిర్వహించారు. సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మా పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్షలు చేయడానికి గుజరాత్‌ తీసుకెళ్లినా ఆరోగ్యం సహకరించకపోవడంతో పరీక్షలు చేయలేదు. ముగ్గురి నార్కో పరీక్షల నివేదికలు పులివెందుల కోర్టులోనే ఉన్నాయి. ఆ నివేదికల్లో ఏముందనే వివరాలను పరిశీలించడానికి సీబీఐ అభ్యర్థించింది. దీంతోపాటు వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన పడక గదిలో ఆయన రాసినట్లు చెబుతున్న లేఖ లభ్యమైంది. ఆ లేఖ దస్తూరి పరీక్షలకు హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు గతంలో సిట్‌ అధికారులు పంపారు. ప్రస్తుతం ఆ ఫోరెన్సిక్‌ నివేదిక, లేఖ అన్నీ పులివెందుల కోర్టులోనే ఉన్నాయి. ఇవి తీసుకుంటే దర్యాప్తునకు మరింత ఉపయోగపడతాయనే భావన సీబీఐ అధికారుల్లో ఉందని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.