Heavy Rains : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్ నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తువరకూ వ్యాపించి ఉంది. ఆదివారం నాటికి కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.
దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు బలడుతాయని పేర్కొంది. అదేవిధంగా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమలో జోరు వానలు పడుతాయని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఇక, భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయిలో నిండిపోయింది. 2 లక్షల 74వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. ఉండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా అధికారులు కిందకు వదులుతున్నారు.
మరోవైపు నాగార్జున సాగర్ లోనూ నీటి ప్రవాహం అధికంగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా, 311.75 టీఎంసీ నీరు నిల్వ ఉంది. దీంతో.. శ్రీశైలం నుంచి వస్తున్న 2లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని 14 గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నారు.
మరోవైపు.. గోదావరిలోనూ వరద ప్రవాహ ఉధృతి అధికంగా ఉంది. దీంతో ముంపు ప్రాంతాలు, విలీనమండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు మరో రెండురోజుల పాటు వర్షసూచన ఉండడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఇప్పడికే తెలంగాణ రాష్ట్రాలో గొలుసుకట్టు చెరువులు, జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. నదులు కూడా అవసరానికి మించి ప్రవహిస్తున్నాయి.