ఉత్తరాది, దక్షిణాది అనే తేడాలేదు.. దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలకు.. నాసిక్ నుంచి దవళేశ్వరం దాకా… ఉరుకుపరుగులతో, ఉధృతితో దూసుకెళ్తోంది గోదావరి నది. తెలుగురాష్ట్రాల్లో ఎంటరైంది మొదలు.. మరింత ఉధృతితో ఎగిసిపడుతూ ముందుకు సాగుతోంది. మహారాష్ట్ర నుంచి తెలుగురాష్ట్రాల్లోకి ప్రవేశించాక.. మరింత ఉధృతితో ముందుకు సాగుతోంది. భారీవర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. తెలంగాణ, ఏపీల్లో గోదావరిపై కీలకమైన ఆరు ప్రాజెక్టుల్లో.. భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో, అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీరామ సాగర్‌కు భారీగా వరద..
ఉత్తరతెలంగాణలో కీలకమైన శ్రీరామ సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. 69,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.దీంతో, 20గేట్లు ఎత్తి.. 69,450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1087 అడుగులకు చేరింది.
కడెం ప్రాజెక్టుకూ..
కడెం ప్రాజెక్టుకూ భారీగా వరద కొనసాగుతోంది. ఒక లక్షా 15వేల వరద నీరు ఇన్ ఫ్లోగా కొనసాగుతోంది. 8 గేట్లు ఎత్తడంతో.. ఒక లక్ష 29లక్షల క్యూసెక్కులను కిందికి వెళ్లిపోతోంది.
కాళేశ్వరానికి మరింత జలకళ..
గోదావరి ఉధృతితో కాళేశ్వరానికి మరింత జలకళ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు ఇన్‌ఫ్లో 60వేల 530 క్యూసెక్కులుగా ఉండగా .. ఔట్ ఫ్లో 62వేల 940 క్యూసెక్కులుగా ఉంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం..
భద్రాచలంలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది గోదావరి. ప్రస్తుతం నీటిమట్టం.. 52.20 అడుగులుగా ఉంది. డిశ్చార్జ్ వాటర్ 14.50లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో, మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్ని అలర్ట్ చేశారు.
స్వర్ణ జలాశయానికి..
స్వర్ణ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 36వేల క్యూసెక్కులుగా ఉంది. మూడు గేట్లు ఎత్తి.. 28వేల క్యూసెక్కుల నీటికి దిగువుక వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 1179కి చేరింది.
పోలవరం వద్ద..
ఏపీలో గోదావరిపై నిర్మాణంలో ఉన్న కీలక ప్రాజెక్ట్ పోలవరం దగ్గర కూడా.. నీటి మట్టం బాగా పెరిగింది. ఇన్ ఫ్లో 10లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో, 9లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి..
అటు, ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి కూడా భారీగా వరద చేరుతోంది.ఇన్ ఫ్లో 13.02లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 13.02లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీగా సముద్రంలోకి వెళుతోంది వరదనీరు. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.