మనల్ని మనం నమ్ముకుంటే జీవితంలో అనుకున్నవి సాధించ్చు.. నటరాజన్‌కు హర్భజన్ ప్రశంసలు
నటరాజన్ చూస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు అధిగమించిన తీరు, ప్రస్తుతం ఆసీస్ టూర్‌లో అదరగొడుతున్న విధానం అద్భుతం. కష్టపడి పనిచేస్తూ, మనల్ని మనం నమ్ముకుంటే జీవితంలో..
నటరాజన్ చూస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు అధిగమించిన తీరు, ప్రస్తుతం ఆసీస్ టూర్‌లో అదరగొడుతున్న విధానం అద్భుతం. కష్టపడి పనిచేస్తూ, మనల్ని మనం నమ్ముకుంటే జీవితంలో అనుకున్నవి సాధించగలమని నటరాజన్ నిరూపించాడు. ఈ సిరీస్‌లో నటరాజన్ బ్రిలియంట్ బౌలర్.
టీమిండియాకు నటరాజన్ ముఖ్యమైన పిల్లర్. అవసరమైన సమయంలో వికెట్లు తీసి సత్తా చాటుతున్నాడు. టీమిండియా మ్యాచ్‌లో గెలవడంలో తన పాత్ర అమోఘం. యార్కర్లు సంధిస్తున్న తీరు, డెత్ ఓవర్లలో బౌలింగ్ విధానం ఆకట్టుకుంటున్నాయి.
ఐపీఎల్ 2020లో మెరుగ్గా రాణించిన అతడు టీ20 సిరీస్‌లో స్మిత్ వంటి ఆటగాళ్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఎదురుగా ఎవరున్నా ఏమాత్రం భయపడటం లేదు. తనలో ఉన్న ప్రత్యేకత అదే అంటూ టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ భారత బౌలర్ నటరాజన్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఆసీస్ పర్యటనలో అద్భుతంగా ఆకట్టుకుంటున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదే జరిగితే తనతో పాటు జట్టులో కూడా సరికొత్త ఉత్సాహం నిండుతుంది. టీమిండియాకు తనొక ప్లస్. తనది గొప్ప కథ’’ అని భజ్జీ కొనియాడాడు.
కాగా ఆసీస్ పర్యటనలో మెరుగ్గా రాణిస్తున్న టీమిండియా బౌలర్ నటరాజన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాండ్యా వంటి సహచర ఆటగాళ్లతో పాటు మాజీ దిగ్గజాలు మెక్‌గ్రాత్, ఇయాన్ బిషప్, టామ్ మూడీ తదితరులు అతడి ఆట తీరుకు ఫిదా అవుతున్నారు. కాగా చివరి వన్డేతో అరంగేట్రం చేసిన నటరాజన్ ఆ మ్యాచ్‌లో రెండు, తొలి 20లో 3, రెండో టీ20లో 2 వికెట్లు తీసి సత్తా చాటాడు.