గురుగ్రామ్ సీరియల్ కిల్లర్ మహమ్మద్ రాజి (22) విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. మూడు రాత్రుళ్లలో ముగ్గురిని హత్య చేసిన బిహార్‌కు చెందిన ఇతడిని గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్ 23, 24, 25వ తేదీల్లో ముగ్గురిని హత్య చేసినట్టు రాజి ఒప్పుకున్నాడు. మద్యం ఆశచూసి 23వ తేదీన రాత్రి నగరంలోని లీజర్ వ్యాలీ పార్కు సమీపంలో ఓ వ్యక్తిని గొంతుకోసి చంపేశాడు. మరుసటి రోజు రాత్రి ఓ సెక్యూరిటీ గార్డుని సైతం ఇదే తరహాలో ప్రాణాలుతీశాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, అదుపులోకి తీసుకొని విచారించగా తన వికృత చేష్టలను బయటపెట్టాడు. మనుషుల గొంతు కోస్తుంటే చాలా ఆనందంగా ఉండేదని కూడా మహమ్మద్ రాజీ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, చిన్నతనం నుంచే నాకేం అర్థమయ్యేది కాదని. నేను చాలా బలహీనంగా ఉన్నానని, ఏ పనీ చేయలేనని అందరూ తన్ను ఎద్దేవా చేసేవారని.. అందుకే నేనేం చేయగలనో ప్రపంచానికి చూపించాలనుకున్నా అని రాజి పోలీసుల వద్ద చెప్పుకొచ్చాడు. 25వ తేదీ రాత్రి మరో హత్య చేసినట్లు వెల్లడించాడు. నిందితుడ్ని వెంటబెట్టుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రాకేశ్ కుమార్ (26) అనే వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి శరీరం నుంచి తలను వేరుచేసి మరో ప్రాంతంలో పడేసిన తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడు గురుగ్రామ్‌తోపాటు, ఢిల్లీ, బిహార్‌లో దాదాపు 10 హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది.