భారత- చైనా ఉద్రిక్తతలు, ముఖ్యంగా లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద చైనా ఆక్రమణపై పార్లమెంటులో ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఆదివారం జరిగిన పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తగా ప్రభుత్వ వర్గాలు ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చైనా చొరబాట్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఇరకాటానపెడుతున్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇందుకు సంబంధించి స్లాట్ ఎజెండా ఒకటి అవసరమని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విపక్షాలు చైనా దూకుడుపై చట్ట సభలో మోదీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని యోచిస్తున్నాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసినప్పటికీ.. జీరో అవర్ లో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇలా ఉండగా…. సోమవారం నుంచి పార్లమెంట్ ప్రారంభమవుతుండగా.. ఐదుగురు లోక్ సభ ఎంపీలకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. పార్లమెంట్ సమావేశాలకు 72 గంటల ముందు సభ్యులంతా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇదివరకే ఆదేశించారు.