Delhi: జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను రాబోయే సంవత్సరం నుంచి నగదు రహితం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. జనవరి 1 నుంచి టోల్ గేట్ల వద్ద 100 శాతం వసూళ్ళు ఫాస్టాగ్ ద్వారానే జరిగేలా చూస్తోంది. కాగా ప్రస్తుతం టోల్ ప్లాజా దగ్గర 75 శాతం వరకు ఫాస్టాగ్స్ ద్వారా చెల్లింపులు జరుగుతుండగా, ఒక వరుసలో మాత్రమే డబ్బు చెల్లించే అనుమతి ఉంది.
నేషనల్ హైవేస్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం… స్మార్ట్ ట్యాగ్స్‌ను తొందరగా జారీ చేసేందుకు, వాటిని రీఛార్జ్ చేసేందుకు వీలుగా తగిన సిబ్బందిని నియమించనున్నామని తెలిపింది. కొంతమంది ద్వారా జరిగే నగదు చెల్లింపుల వలన టోల్ ప్లాజాల దగ్గర జరిగే ప్రయాణాలపై ప్రభావం చూపుతాయని.. అందుకు పూర్తి స్థాయి నగదు రహిత చెల్లింపుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అటు ఫోర్ వీలర్, అంతకంటే పెద్ద వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించాలంటే జనవరి ఒకటి నుంచి, మూడు వరకు రెన్యువల్‌కు ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరని రవాణా మంత్రిత్వ శాఖ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ ను నియంత్రించడానికే ఈ ఫాస్టాగ్ విధానాన్ని 2017 నుంచి కేంద్రం అమలు పరుస్తుంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఈ ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది.