గుంటూరులో గోవా లిక్కర్.. ధరలు తగ్గినా ఆగని స్మగ్లింగ్.. లారీ సీజ్, ఇద్దరి అరెస్టు

|

Nov 17, 2020 | 3:46 PM

రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో చర్యలు తీసుకుంటుంటే.. అక్రమార్కులు మాత్రం కొత్త కొత్త విధానాలను అవలంభిస్తూ అక్రమ మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి...

గుంటూరులో గోవా లిక్కర్.. ధరలు తగ్గినా ఆగని స్మగ్లింగ్.. లారీ సీజ్, ఇద్దరి అరెస్టు
Follow us on

Goa liquor caught in Guntur district: రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో చర్యలు తీసుకుంటుంటే.. అక్రమార్కులు మాత్రం కొత్త కొత్త విధానాలను అవలంభిస్తూ అక్రమ మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి తరలిస్తూనే వున్నారు. తాజాగా గోవా నుంచి తరలిస్తున్న నాలుగు వేళ మద్య బాటిళ్ళను గుంటూరు జిల్లాలో సీజ్ చేశారు. వాషింగ్ మిషన్లలో దాచి పెట్టి మరీ అక్రమ మద్యాన్ని రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్న అక్రమార్కులను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో సరైన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని, ధరలు ఆకాశాన్నంటేలా పెంచేశారని మందు ప్రియులు పక్క రాష్ట్రాల వైపు చూశారు. దాంతో తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏపీకి చేరింది. అక్రమ మద్యం తరచూ పట్టుబడుతుండడంతో ముఖ్యమంత్రి జగన్ లిక్కర్ ధరలను తగ్గిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాక తగ్గిపోతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఆ తర్వాత కూడా అక్రమ మద్యం ఏపీలోకి తరలుతూనే వుందని తాజాగా గుంటూరులో పట్టుబడిన మద్యాన్ని చూస్తే తేలిపోతోంది.

అక్రమ మద్యాన్ని తరలించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు అక్రమార్కుల. గోవా నుంచి విజయవాడకు వాషింగ్ మిషన్ల లోడ్ వస్తుంటే అందులో మద్యం బాటిళ్ళను పెట్టి అక్రమంగా తరలించే యత్నం చేశారు. గోవా నుంచి కర్నాటక మీదుగా ఏపీలోకి వచ్చిన ఈ అక్రమ మద్యం చివరికి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామం వద్ద పట్టుబడింది. సుమారు పది లక్షల రూపాయల విలువైన 4 వేల 20 మద్యం బాటిళ్ళను గుంటూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి.. తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వారి విషయంలో ప్రజలకు ఎలాంటి సమాచారం వున్నా తమకు తెలియజేయాలని ఎస్పీ విశాల్ గున్నీ పిలుపునిచ్చారు.

ALSO READ: అళగిరికి బీజేపీ గాలం.. త్వరలో అమిత్‌షాతో అళగిరి భేటీ!