చైనా కుట్రలు కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. గిచ్చి కయ్యం పెట్టుకునే రకమని తేలిపోయింది.. సరిహద్దుల్లో పొరుగుదేశాలను రెచ్చగొడుతూ ఉద్దేశపూర్వకంగానే గొడవలకు దిగుతుందని అమెరికా నిఘా సంస్థల కమిటీ తన తాజా నివేదికలో తెలిపింది.. జూన్‌లో జరిగిన గల్వాన్ ఘర్షణలు కూడా ఇలాంటిదేనని చెప్పింది.. పక్కా ప్రణాళికతోనే ఘర్షణలకు దిగిందని నివేదికలో వెల్లడించింది.. అమెరికా కాంగ్రెస్‌కు తాజాగా అమెరికా-చైనా ఆర్ధిక భద్రత సమీక్ష కమిషన్ ఇచ్చిన నివేదికతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గల్వాన్ లోయలో చైనా ప్రభుత్వం ఓ పథకం ప్రకారం దాడులకు పాల్పడిందని నివేదిక తెలిపింది. ఇందుకు తగిన ఆధారాలను కూడా పొందుపరిచింది. ఘర్షణలకు కొన్ని రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలను గమనిస్తే చైనా ప్లాన్ ఏమిటో అర్థమవుతుంది. ఘర్షణలకు కొన్ని వారాల ముందు చైనా రక్షణమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత చైనా ప్రభుత్వ ఆధీనంలో నడిచే గ్లోబల్ టైమ్స్‌లో అడ్డగోలు రాతలు రాయడం, భారత్‌పై పనికిమాలిన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే గల్వాన్‌లో ఎంత ప్రణాళికబద్దంగా దాడులకు దిగిందో తెలిసిపోతుంది.. గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ మొత్తం ఇండియాను హెచ్చరిస్తూనే సాగింది.. అంతేనా, గల్వాన్ ఘటనకు వారం రోజుల ముందే చైనా ఆ ప్రాంతంలో ఆయుధ కార్యకలాపాలకు పాల్పడింది.. ఇందుకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు రుజువుగా ఉన్నాయి.. చైనా ఆర్మీకి చెందిన సుమారు వెయ్యి మంది జవాన్లు గల్వాన్ లోయకు వచ్చారు.. ఓ పథకం ప్రకారం హింసకు పాల్పడ్డారు. గల్వాన్ ఘర్షణలో చైనాకు చెందిన సైనికులు కూడా చాలామందే చనిపోయారు కానీ.. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్యను చైనా బయటపెట్టలేదు..