ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 రసవత్తరంగా సాగుతోంది. చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్ రెండో విజయాన్ని ఒడిసిపట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీపై 2-1తో గెలుపొందింది. చెన్నయిన్ తరఫున రాఫెల్ క్రివాలెరో(5వ నిమిషం), రహీమ్ అలీ (53వ నిమిషం) గోల్స్ సాధించారు. గోవా తరుఫున జోర్జ్ మెండోజ(9వ నిమిషం)లో ఒక గోల్ చేశాడు. మొదటి అర్థ భాగంలో రెండు జట్లు చెరో గోల్ చేశాయి. అయితే, ద్వితీయ అర్థభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన రహీమ్ గోల్ కొట్టి చెన్నయిన్‌కు గెలుపు అందించాడు.
మ్యాచ్ ప్రారంభమైన 5వ నిమిషంలోనే రాఫెల్ క్రివాలెరో చెన్నయిన్‌కు అదిరిపోయే ఆరంభం అందించాడు. అయితే మరో నాలుగు నిమిషాల వ్యవధిలోనే జోర్జ్ మెండోజ్ గోల్ చేయడంతో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. ఆ తర్వాత రెండు జట్లు పందెం కోళ్లలా తలపడ్డాయి. ఇరు జట్లు కట్టుదిట్టంగా రాయడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ క్రమంలో మరో గోల్ లేకుండానే మొదటి అర్థ భాగం ముగిసింది.
ద్వితీయ అర్థ భాగంలో ఇరు జట్లు అదే పోరాట పటిమ కనబర్చడంతో మ్యాచ్ డ్రా అవ్వొచ్చని అందరూ భావించారు. కానీ 53 వ నిమిషంలో చెన్నయిన్ ఆటగాడు రహీమ్ అలీ గోల్ చేయడంతో ఆ జట్టు 2-1తో లీడ్‌లోకి వెళ్లింది. అనంతరం ఆట ఇంకా టఫ్‌గా సాగింది. గోవా విశ్వప్రయత్నాలు చేసినా చెన్నయిన్ వారి నుంచి గోల్ పడకుండా సమర్థవంతంగా ఎదుర్కుని విజేతగా నిలిచింది. కాగా, లీగ్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్ రెండు విజయాలు, రెండు డ్రాలు, రెండు ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉండగా.. ఏడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 3 ఓటములు, 2 డ్రాలతో గోవా ఏడో స్థానంలో ఉంది.
Also Read :
Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ