న్యూ ఢిల్లీ : మసీదుల్లోకి మహిళలు ప్రవేశించవచ్చా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ అంశంపై పిటిషన్‌ను పరిశీలించినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లవచ్చు అంటూ గతేడాది సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. పుణేకు చెందిన ఓ ముస్లిం దంపతులు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. మహిళలను మసీదులోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అక్రమమని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు 14, 15, 21, 25, 29 ఆర్టికల్స్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని కూడా పిటిషన్‌లో తెలిపారు. మహ్మాద ప్రవక్త కానీ.. ఖురాన్ కానీ.. మహిళలు మసీదుకు వెళ్లరాదు అని చెప్పలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.