Online Classes For Engineering : ఇంజనీరింగ్ 2020-21 విద్యాసంవంత్సరంకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ చదువుతున్న పాత విద్యార్థులకు ఆగస్టు 17 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని జేఎన్‌టీయూకే (JNTUK), జేఎన్‌టీయూఏ (JNTUA) నిర్ణయించింది. బీటెక్, బీ.ఫార్మసీ కోర్సుల రెండు, మూడు, నాలుగో సంవత్సరపు విద్యార్థులతో పాటు ఎంబీఏ(MBA), ఎంటెక్, ఎంసీఏ(MCA) తదితర కోర్సుల పాత విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది.
2020-21 విద్యా సంవత్సరంలో తొలిసారి అడ్మిషన్ పొందే విద్యార్థులకు తప్ప మిగిలిన విద్యార్థులకు ఏఐసీటీఈ ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించుకునేందుకు విశ్వవిద్యాలయాలకు తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సాంకేతిక విశ్వవిద్యాలయాలు కూడా(AICTE)ఏఐసీటీఈ బాటలోనే నడవాలని నిర్ణయించాయి. సెమిస్టర్ పరీక్షల్లో ఈ సారి జంబ్లింగ్ విధానాన్ని ఎత్తి వేయాలని ఆయా వర్సిటీలు నిర్ణయించాయి.
ఇక, సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్‌టీయూఏ భావిస్తోంది. విద్యార్థులందరినీ ఒకేసారి కాకుండా బ్యాచ్‌ల వారీగా చేసి ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు కోల్పోయిన నేపపథ్యంలో వారంలో ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహించాలని జేఎన్‌టీయూకే భావిస్తున్నట్లుగా సమాచారం.