
ధరణి పోర్టల్ దేశంలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నేడు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించబోతోన్న తరుణంలో సీఎస్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి…స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా అన్నింటిని పరిశీలించారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో తహశీల్దారులకు ధరణీ పోర్టల్ మీద శిక్షణ తరగతులను నిర్వహించారు. ప్రజలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఎవరి పేరుపై భూమి ఉంటుందో వారి ఆధార్ ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలన్న సీఎస్.. ప్రభుత్వ భూమి, వక్ఫ్, దేవాలయ భూములను ఆటోలాక్‌లో పెట్టినట్లు వివరించారు. ధరణి పోర్టల్ పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్.. రెవెన్యూ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్లాట్ బుకింగ్, సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్, పార్టిషన్ మాడ్యూల్స్‌ను వివరించారు. తహసీల్దార్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల విధులు, బాధ్యతలను గుర్తుచేశారు. రిజిస్ట్రేషన్ సేవలతో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని వారు రెవెన్యూ విధులతో పాటు జాయింట్ సబ్ రిజిష్ట్రార్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. రెవెన్యూ అధికారులు ఒక టీం వర్క్‌లా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ధరణి టెక్నికల్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూంతో పాటు జిల్లా స్థాయి టెక్నికల్ సపోర్ట్ టీంలు పని చేస్తాయన్నారు. ధరణి అమలుకు అవసరమైన సౌకర్యాలను తహసీల్దార్ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.