
ఢిల్లీపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. మారణకాండ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కారణంగా ఢిల్లీలో చెలరేగిన నిరసన జ్వాలలు ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొన్నాయి. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటూ అనేకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాత్సవను నియమించారు. ఢిల్లీ అల్లర్లు మొదలైన తర్వాత శ్రీవాత్సవను స్పెషల్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) గా నియమించారు. ఆయన సీఆర్పీఎఫ్ కు చెందిన అధికారి.
ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న అమూల్య పట్నాయక్ రేపటితో పదవీ విరమణ చేయనున్నారు. అమూల్య పట్నాయక్ స్థానంలో శ్రీవాత్సవకు పోలీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయనే ఢిల్లీ కమిషనర్ గా కొనసాగుతారు. దీనిపై శ్రీవాత్సవ మాట్లాడుతూ, తాము భద్రంగా ఉన్నామనే భావనను ప్రజల్లో కలిగించడమే తన ప్రధాన కర్తవ్యమని, పోలీసులు ఉన్నది ప్రజల కోసమేనని వారిలో నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.