
దేశ రాజధానిలో గత16 రోజులుగా ఆందోళనలు..గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయడం లేదు. కేంద్రం చేసిన సవరణల ప్రతిపాదనలకు ససేమిరా అంటున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే అంటూ బీష్మిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేదని ఉడుం పట్టు పట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నల ఆందోళన రోజురోజుకీ మరింత ఉధృతమవుతోంది. తమ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించినా..చట్టాల రద్దు తప్ప రెండో ఆలోచనే లేదంటున్నారు కర్షకులు.
ఇప్పటికే రైతులతో పలుమార్లు చర్చలు జరిపింది కేంద్రం..కానీ ఎందులోను పురోగతి లేదు. రైతుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సవరణల ప్రతిపాదనలు పంపించింది. వ్యవసాయ చట్టాల రద్దు కుదరదని అందులో స్పష్టం చేసింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సవరణలకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం కొన్ని ప్రతిపాదనలు రైతుల ముందు ఉంచింది. కనీస మద్దతు ధర విధానం కొనసాగింపుపై లిఖితపూర్వక హామీ ఇస్తామని వివరించింది. అయినా సరే, వ్యవసాయ చట్టాలపై పట్టు వీడటం లేదు రైతులు. మెట్టు దిగడం లేదు కేంద్రం. ఇలా చర్చల్లో ప్రతిష్టంభన..ఇప్పటికి కంటిన్యూ అవుతుంది..
అయితే, వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు కేంద్ర మంత్రులు తోమర్, పీయూష్ గోయల్. తదుపరి చర్చల తేదీని వీలైనంత త్వరగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. చర్చల సమయంలో ఆందోళనలు సరికాదన్నారు. మంత్రుల విజ్ఞప్తిపై స్పందించిన రైతు సంఘాల నేతలు..కేంద్రం మరోసారి ఆహ్వానం పంపితే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఢిల్లీ శివార్లలోని సింగూ బోర్డర్‌లో జరిగిన చర్చల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. కేంద్రం ప్రతిపాదనలు కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆరోపించాయి. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈనెల 12వ తేదీన ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్భంధిస్తామని ప్రకటించారు. ఈనెల 14వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలతో పాటు జాతీయ రహదారులను దిగ్భంధిస్తామని తెలిపారు. బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని కూడా ప్రకటించారు.