
హైదరాబాద్ మిస్సింగ్ కేసులపై ఆందోళన వద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. మిస్సింగ్ కేసులపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. ఈ కేసుల గురించి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. చాలామంది వ్యక్తిగత సమస్యల కారణంగానే ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు వివరించారు.
వ్యవస్థీకృత పద్ధతిలో ఈ మిస్పింగ్ కేసులు జరగటం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి మిస్సింగ్ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో.. దర్పణ్ అనే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, ఆపరేషన్ స్మైల్ వంటివి ఈ రకమైన కేసులను పరిష్కరించటంలో ఎంతో తోడ్పాటునందిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, క్రైం వారిని కూడా ఉపయోగించుకుంటున్నాని తెలిపారు. తల్లిదండ్రులు తిట్టారని, అప్పుల బాధ తాళలేక, ఇతరత్రా సమస్యలతో ఇల్లు విడిచి వెళ్లిపోయిన కేసులు చాలా ఉంటున్నాయని అన్నారు.