కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. టెస్ట్ రిపోర్టు వచ్చే లోపే లోకం చుట్టేస్తుంది. కరోనా లక్షణాలు ఏమాత్రం లేకున్నా వైరస్ బారినపడుతున్నారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాక కొన్నిసార్లు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు క్వారంటైన్ లో ఉండకుండా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. అయితే, కరోనా పరీక్షల అలస్యనికి చెక్ పెడుతూ ఇజ్రాయెల్ కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పదుల సెకన్లలోనే ఫలితాన్ని ఇవ్వగల అత్యంత వేగవంతమైన కరోనా పరీక్షా పద్ధతిని తీసుకువచ్చారు. ఇంకొన్ని నెలల్లోనే దీన్ని ఆవిష్కరిస్తామని ఇజ్రాయెల్ రక్షణశాఖ ప్రకటించింది. ఇందుకోసం భారత్ అందిస్తున్న సహకారాన్ని కొనియాడింది. భారత్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల ప్రజల నుంచి 20వేలకుపైగా రక్త నమూనాలను సేకరించే ప్రక్రియను జూలై 26న ప్రారంభించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఆ శాంపిళ్లు ఇజ్రాయెల్‌కు చేరగానే.. వాయిస్ టెస్ట్, టెర్రా హెర్ట్జ్ తరంగాలతో శ్వాస విశ్లేషక పరీక్ష, ఐసోథర్మల్ టెస్టు, పాలీఅమైనో యాసిడ్ పరీక్షా పద్ధతుల ద్వారా విశ్లేషించే కసరత్తు మొదలవుతుందన్నారు. ఇందులో వచ్చే ఫలితాలే.. వేగవంతమైన కరోనా టెస్టుకు ప్రాతిపదిక కాబోతున్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ అధ్యయనం సత్ఫలితాలు ఇస్తందని.. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరికరాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపింది.