
కృష్ణా జిల్లాలో కరోనావైరస్ వీరవిహారం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్-19 వల్ల జిల్లాలో మరణించేవారి సంఖ్య కూడా ఆందోళనకరంగా ఉంది. ఆదివారం ఒక్క రోజులో మరో 66 పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం. సోమవారం రిలీజ్ చేసిన వివరాల ప్రకారం మరో 15 మందికి కోవిడ్ సోకింది. జిల్లాలో గత ఐదు రోజుల్లో పది మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా వచ్చిన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1063కి చేరింది. వీరిలో 463 మంది వ్యాధి నయమై డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం 37 మంది ఇప్పటివరకూ వైరస్ బారినపడి మృతి చెందారు. కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉండటం కలవరపెట్టే అంశం.
కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య జూన్ ప్రారంభం నుంచి జిల్లాలో రోజురోజుకు పెరిగిపోయింది. జూన్ 1 నుంచి 21 వరకూ 583 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఈ నెల 15 నుంచి 21 వరకు 347 కేసులు నమోదవ్వడం గమనార్హం. 60 శాతం జూన్‌లోనే నమోదయ్యాయి. విజయవాడ సిటీలో కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా ఉంది. కానీ జనం మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. భౌతిక దూరం అస్సలు పాటించడం లేదు. కొంతమంది మాస్కులు ధరించడం మానేశారు. అధికారులు రూల్స్ అతిక్రమించేవారిపై చర్యలు తీసుకోకపోతే కేసుల సంఖ్య ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తోంది.