ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 147 కి పెరగగా.. ఆర్మీలో తొలి కేసు నమోదయింది. లడఖ్ స్కౌట్స్ కి చెందిన 34 ఏళ్ళ సైనికునికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్టు బుధవారం గుర్తించారు. అతడిని వెంటనే ఐసొలేషన్ కి తరలించారు. కరోనా కేసుల్లో ముగ్గురు రోగులు మరణించారని, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఈ డెత్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో దుబాయ్ కి వెళ్లి తిరిగి వఛ్చిన 68 ఏళ్ళ వ్యక్తి ముంబైలో మరణించాడు. తన ట్రావెల్ హిస్టరీని ఆయన తెలియజేయలేదట. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకు ప్రభుత్వ ఉదాసీనతే కారణమన్న విమర్శలను ఈ వర్గాలు ఖండించాయి. దేశంలో తగినన్ని టెస్టింగ్ ఫెసిలిటీలు లేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనను ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తిరస్కరిస్తూ.. కరోనా టెస్టింగ్ వంద శాతం ట్రాన్స్ పరెంట్ గా ఉందని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించరాదన్న సంయమనంతోనే తాము ఆచితూచి వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం టెస్టింగ్ కోసమే టెస్టింగ్ చేయాలన్నది తమ అభిమతం కాదన్నారు. గత జనవరి నుంచి ఇండియాలో 11,500 సాంపిల్స్ ను టెస్ట్ చేశారు.. అంటే రోజుకు 700 టెస్టులు జరుగుతున్నాయన్న మాటేగా’ అని ఆయన పేర్కొన్నారు.