బొబ్బిలిలో పోలీసులు వర్సెస్ మున్సిపల్‌ సిబ్బంది.. ఉద్యోగుల మధ్య రచ్చ..రచ్చ.. కోల్డ్ వార్‌కు కారణం ఇదే..

|

Dec 03, 2020 | 8:55 PM

విజయనగరం జిల్లాలో రెండు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నువ్వెంతా అంటే నువ్వెంతా అనుకుంటున్నారు. రెండు శాఖల మధ్వ సమన్వయం లేకపోవడంతో స్థానికులకు తలనొప్పిగా..

బొబ్బిలిలో పోలీసులు వర్సెస్ మున్సిపల్‌ సిబ్బంది.. ఉద్యోగుల మధ్య రచ్చ..రచ్చ.. కోల్డ్ వార్‌కు కారణం ఇదే..
Follow us on

విజయనగరం జిల్లాలో రెండు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నువ్వెంతా అంటే నువ్వెంతా అనుకుంటున్నారు. రెండు శాఖల మధ్వ సమన్వయం లేకపోవడంతో స్థానికులకు తలనొప్పిగా మారింది. మున్సిపల్‌, పోలీస్‌ శాఖల సిబ్బంది మధ్య గొడవకి కారణం ఏమిటి? దీనికి పరిష్కార మార్గం ఏమిటో తెలియక స్థానికులు, ఉన్నతాధికారులు అయోమయానికి గురవుతున్నారు.

బొబ్బిలిలో పనిచేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేశారు. ఇదే పోలీస్‌ శాఖకు, మున్సిపల్‌ శాఖ ఉద్యోగుల మధ్య అగ్గి రాజేసింది. పోలీసులు ఫైన్ వేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన మున్సిపల్ సిబ్బంది వారికి అందించే సేవలను నిలిపివేశారు. పోలీస్ క్వార్టర్స్ కి వెళ్లే పైప్ లైన్ డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయకుండా సాకులు చెప్పి గాలికొదిలేశారు.

పోలీసులు పదే పదే సమస్య పరిష్కరించమని చెప్పినా పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ సిబ్బందితో మరమ్మతులు చేపట్టారు. ఇది తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది స్పాట్‌కి చేరుకొని వాళ్లు కూడా పని చేయకుండా అడ్డుపడ్డారు. మున్సిపల్ ఉద్యోగుల తీరుపై అప్పటికే కోపంతో ఉన్న పోలీస్‌ అధికారులు ఇద్దరు సిబ్బందిని స్టేషన్‌కి పిలిపించారు. ఎంక్వైరీ పేరుతో రాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. మునిసిపల్ సిబ్బంది ‌స్టేషన్‌లో ఉన్నారని తెలుసుకున్న ఇంజనీరింగ్ అధికారులు , కార్మిక సంఘాలు నేతలు విడిచిపెట్టమని కోరినా పోలీసులు తగ్గలేదు.

తమ వాళ్లను స్టేషన్‌లో ఉంచడాన్ని నిరసిస్తూ మున్సిపల్‌ సిబ్బంది బొబ్బిలి టౌన్‌ అంతా రాత్రి కరెంట్‌ సప్లై నిలిపివేశారు. శాఖల మధ్య వివాదంలో మున్సిపల్ కమిషనర్‌ నాయుడు జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఇద్దర్ని విడిచిపెట్టారు. పోలీసులు ఊపేక్షించినా…మున్సిపల్ సిబ్బంది మాత్రం పట్టువీడలేదు. ఇవాళ కూడా టౌన్‌లోని వాళ్లందరికి వాటర్ సప్లై నిలిపివేశారు. పోలీసులు జులుం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ముున్సిపల్‌ సిబ్బంది.

రెండు శాఖల ఉద్యోగులు పౌరుషానికి పోవడంతో పట్టణ ప్రజలు రాత్రి కరెంట్ లేక..ఉదయం నుంచి నీళ్లు రాక నానా అవస్థలు పడుతున్నారు. ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.