హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఘనవిజయం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ముందుగా ఇంతటి గెలుపును అందించిన నియోజకవర్గ ఓటర్లకు కృతఙ్ఞతలు తెలిపారు. ప్రతికూల వాతావరణంతో తన సభ జరగకపోయినా ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. ఈ విజయం ప్రభుత్వానికి టానిక్‌లా పనిచేస్తుందన్నారు. త్వరలోనే హుజూర్‌నగర్ వెళ్లి కృతజ్ఞత సభ ద్వారా ప్రజలకు ధన్యవాదాలు చెబుతానన్నారు. ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. కార్మికులు ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, తెలివి తక్కువ నినాదం. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఔచిత్యం లేదు. ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీయే ముగుస్తుంది” అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ చేసిన మరిన్ని వ్యాఖ్యలు దిగువ వీడియోలో..