కరోనాపై నిర్లక్ష్యం వద్దని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని తేల్చి చెప్పారు. కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని, కాబట్టి ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు, జేసీలకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
స్పందన కార్యక్రమంపై జిల్లాల్లోని అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు. కరోనాపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా టెస్ట్ తప్పనిసరిగా చేయాలన్నారు. RTPCR, ట్రూనాట్ టెస్ట్‌ల్లో ఫలితాలు 24 గంటల్లో రావాలని, రాపిడ్ టెస్ట్‌ల్లో ఫలితం 30 నిమిషాల్లో రావాలని స్పష్టం చేశారు.
పాజిటివ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను హోం క్వారంటైన్‌లోనే ఉంచాలన్నారు. అదనపు సిబ్బంది నియామకాలు కొన్ని చోట్ల ఇంకా పూర్తి కాలేదని, వెంటనే దాన్ని చేపట్టాలని ఆదేశించారు. మరో వారం రోజుల్లో రెగ్యులర్ పోస్ట్‌ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కరోనా చికిత్సను కలెక్టర్లు, జేసీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేశారు సీఎం జగన్.
ఎవరైనా ఆస్పత్రిలో అడ్మిషన్ కోసం ఫోన్ చేస్తే అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాల్ సెంటర్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అవసరమైతే రోజూ మాక్ కాల్స్ చేసి సరిచూసుకోవాలన్నారు.