Chandrababu fires on CM Jagan Delhi tours: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్రలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ యాత్రలు రాష్ట్రం కోసమా లేక వ్యక్తిగత రక్షణ కోసమా అని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యాక పది సార్లు ఢిల్లీ వెళ్ళి జగన్ సాధించిందేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఆయన తూర్పు గోదావరి జిల్లా టీడీపీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.
‘‘ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది ఎందుకు..? తన కేసుల మాఫీ కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసమా..? పది సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి జగన్ ఒరగబెట్టిందేమిటి..? విశాఖ రైల్వే జోన్‌కు నిధులు అడిగావా..? కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో అడిగావా..? విసిఐసి, బిసిఐసి ఏమయ్యాయో పట్టించుకోవా..? పెట్రోలియం కాంప్లెక్స్ ఏమైందో ప్రశ్నించావా? తొలి ఏడాది ఆర్ధిక లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు అడిగావా.. ? అప్పుడు మెడలు వంచుతానని చెప్పి, ఇప్పుడు సాష్టాంగ దండ ప్రమాణాలా..? వ్యాక్సిన్ పంపిణీ వంకతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలని మరో జగన్నాటకానికి తెరలేపారు.. డిసెంబర్ 25 నుంచి కోటిమందికి వ్యాక్సిన్ పంపిణీ అంటూ దొంగ ట్వీట్లు పెడుతున్నారు.. ’’ తీవ్రస్థాయిలో చెలరేగారు చంద్రబాబు.
నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే ఓటమి భయం వైసిపికి వెన్నాడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే వ్యాక్సిన్ పంపిణీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో వైసిపి దాడులు, దౌర్జన్యాలకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో టిడిపి గెలుపే వైసిపి దుర్మార్మాలకు అడ్డుకట్ట అవుతుందన్నారు. జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి శ్రేణులంతా సంసిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.