మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపించాడు. వాతలు వచ్చేలా, చర్మం కమిలిపోయేలా కొట్టి క్రూరంగా ప్రవర్తించాడు. టీచర్‌ను కామెంట్ చేశాడన్న నెపంతో ప్రిన్సిపాల్ సహా ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని చావ చితకబాదారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల మోడల్ స్కూల్‌లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.
శివ అనే విద్యార్థి స్థానిక మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. టీచర్‌ను కామెంట్ చేశాడనే నెపంతో..శివను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు హింసించారు. స్కూల్‌లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ చిత్రహింసలు పెట్టారని బాధితుడు తల్లిదండ్రులకు వివరించాడు. ఒంటినిండా దెబ్బలతో నడవలేని స్థితిలో ఉండటంతో విద్యార్థి తల్లిదండ్రులను స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి చేయని తప్పుకు వాడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడి సోదరుడు వాపోయాడు. అకారణంగా విద్యార్థిని చితకబాదిన టీచర్లు, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.